Telangana:తెలంగాణలో ఆశావహ ఎమ్మెల్యేలను ఎన్నాళ్లుగానో ఊరిస్తూ వచ్చిన మంత్రి మండలి విస్తరణ త్వరలో ఉండనున్నదా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. దసరా పర్వదినాన ఉండొచ్చన్న రాజకీయ విశ్లేషకుల అంచనాలు కూడా తారుమారైన నేపథ్యంలో దీపావళికి, లేదా అంతకు ముందే మంత్రిమండలిని విస్తరించే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాలే భావిస్తున్నాయి. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ కూడా త్వరలో మంత్రిమండలి విస్తరణ ఉంటుందని ధ్రువీకరించారు. ఇప్పటికే సీఎం, ఇతర కీలక మంత్రులు అధిష్ఠానం వద్ద ఖరారు చేసి వచ్చినట్టు ప్రచారం కూడా జరుగుతున్నది.
Telangana:కాంగ్రెస్ పార్టీలో ఏదైనా కీలకమైన అంశం తేలాలంటే వెంటనే అయ్యేది కాదు. ఇన్నాళ్లూ మంత్రిమండలి విస్తరణ పైన చర్చోపచర్చలు, పార్టీ భవితవ్యం, అవసరాలపై మథనం జరిగింది. ఎమ్మెల్యేల్లో ఎవరు అర్హులు, వారి వల్ల పార్టీకి జరిగే లాభనష్టాలపై బేరీజు వేసుకున్నట్టు తెలిసింది. ఆశావహ ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున ఫైరవీలు చేసుకున్నట్టు ప్రచారం. అయితే సీఎం, కీలక మంత్రులైన భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పార్టీ అధిష్ఠానం చర్చించి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. అయితే ప్రకటించడమే తరువాయి అన్నట్టు తెలిసింది.
Telangana:ఇప్పటికే ప్రచారంలో ఉన్న ఎమ్మెల్యేల పేర్లు గట్టిగా వినిపిస్తున్నా ఆఖరు వరకు తేలేలా లేదు. ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. భువనగిరి ఎంపీ ఎన్నికల్లో ఆయనకు స్వయంగా పెద్దలే హామీ ఇచ్చారు. ఒక కుటుంబంలో ఒకరికే పదవి అన్న విషయంలో వీరికి చెల్లబోదని తేల్చేసినట్టు సమాచారం. ఆయన సోదరుడైన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రిగా ఉన్న రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలనే పార్టీ నిర్ణయానికి వచ్చిందని ఆ పార్టీ ముఖ్య నేత ఒకరు చెప్పారు.
Telangana:సోదరుడు ఎమ్మెల్యే, కొడుకు ఎంపీగా ఉన్న మరో కాంగ్రెస్ ముఖ్య నేత అయిన వివేక్‌కు కూడా మంత్రి పదవి దక్కే విషయంలో తీవ్ర చర్చే జరిగిందని తెలిసింది. ఆయన వల్ల పార్టీకి లాభమే తప్ప నష్టముండదని భావించిందని తెలిసింది. కుటుంబ సభ్యులకు పదవులు ఉన్నా ఆయనకు తప్పక ఇవ్వాలన్న నిర్ణయానికి పార్టీ అధిష్ఠానం వచ్చిందని సమాచారం.
Telangana:మంత్రి వర్గంలో రెడ్ల సంఖ్య పెరిగినా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో పాటు సుదర్శన్‌రెడ్డికి కూడా మంత్రి పదవి ఇవ్వాలనే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆలోచన చేసినట్టు తెలిసింది. ఈ ముగ్గురు విషయంలోనూ సీఎం రేవంత్ సహా కీలక మంత్రులు కూడా మద్దతు తెలిపినట్టు విశ్వసనీయ సమాచారం. ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నా నలుగురికే చోటు దక్కే అవకాశం ఉండటంతో మరొక ఎస్టీ నేతకైనా, మైనారిటీ నేతలకైనా మంత్రి పదవి ఇవ్వాలనే విషయంలో ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు కూడా చర్చ జరుగుతున్నది. రేపోమాపో అనుకుంటూ వచ్చిన మంత్రి వర్గ విస్తరణ మాత్రం దీపావళి పండుగకు అటూ ఇటుగా ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తున్నది.