Telangana Cabinet: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. జూలై నెలలో తొలి వారం నుంచి విడతల వారీగా ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నది. ఈ మేరకు జూన్ 5న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నతాధికారులకు ఆదేశాలను జారీ చేశారని సమాచారం.
ఈ మేరకు గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలను విడతల వారీగా నిర్వహించేందుకు అధికార వర్గాలు కసరత్తును మొదలుపెట్టాయి. పంచాయతీల్లో 2024 జనవరి 31న నాటికే పదవీకాలం ముగిససింది. జిల్లా, మండల పరిషత్ సభ్యుల పదవీకాలం అదే ఏడాది జూలై 3న ముగిసింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలకవర్గాల పదవీకాలం ఈ ఏడాది జనవరి 26న పదవీకాలం ముగిసింది.
ఇదిలా ఉండగా, 2021లో జరిగిన కొన్నింటికి మాత్రం ఇంకా పదవీకాలం కొనసాగుతున్నది. గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు కొన్ని మున్సిపాలిటీలకు 2021లో ఎన్నికలు జరగగా, వీటి పదవీకాలం 2026లో ముగియనున్నది. వీటికి మాత్రం 2026 తర్వాతే ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది.
రాష్ట్రంలో అంతకు ముందు 12,769 పంచాయతీలు ఉండగా, ప్రస్తుతం 12,991 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కొత్తగా 223 పంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసింది. 33 జిల్లా పరిషత్‌లు, 620 మండల పరిషత్‌లు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలను కలుపుకుంటే మొత్తంగా ఆ సంఖ్య 153కు పెరుగుతుంది.
ప్రధానంగా తొలుత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ప్రభుత్వం నిర్వహించే అవకాశం ఉన్నది. ఆ తర్వాత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నిర్వహించే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. ఆ తర్వాతే అంటే ఆగస్టు నెలలో పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తారని అధికార వర్గాల ద్వారా తెలుస్తున్నది. అంటే జూలై నెలలో ప్రారంభించి, ఆగస్టు నెలలోగా స్థానిక సంస్థల ఎన్నికలను ముగిస్తారని తెలుస్తున్నది.