Telangana: ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు చెల్లించాలని ఒకవైపు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థి సంఘాలు ఆందోళనలు కొనసాగిస్తుండగా, బకాయి బిల్లుల కోసం మరో సంఘం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నది. రెండు సంవత్సరాలుగా ఉన్న బిల్లుల బకాయిలను చెల్లించాలని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. లేదంటే సహాయ నిరాకరణకే సిద్ధపడుతున్నది.
Telangana: వివిధ శాఖల పరిధిలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం గత రెండేండ్లుగా ఇవ్వాల్సిన బకాయిలే రూ.36 వేల కోట్ల వరకు ఉన్నాయని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఆయా బిల్లులను నవంబర్ నెలాఖరులోగా చెల్లించాలని డిమాండ్ చేసింది. లేదంటే డిసెంబర్ 1 నుంచి సివిల్ వర్క్స్ బంద్ పాటిస్తామని హెచ్చరించింది.
Telangana: కాంట్రాక్టర్లు, బిల్డర్లు తమ ఆస్తులను తాకట్టు పెట్టి, అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి నిర్మాణ పనులు చేస్తున్నారని, వారికి కాంగ్రెస్ సర్కారు రెండు సంవత్సరాలుగా బిల్లులను పెండింగ్‌లో పెట్టిందని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షుడు డీవీఎన్ రెడ్డి, రాష్ట్ర శాఖ చైర్మన్ యూ సురేందర్ తెలిపారు. ఈ మేరకు సచివాలయంలో వినతిపత్రం సమర్పించినట్టు వారు తెలిపారు.
Telangana: గత ప్రభుత్వ హయాంలో చేసిన బిల్లులను నిలిపివేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుందని తమకు తెలిసిందని డీవీఎన్ రెడ్డి, సురేందర్ తెలిపారు. తమకు రాజకీయాలను ఆపాదించకుండా, తమ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, లేదంటే సహాయ నిరాకరణ తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులకు కూడా వినతిపత్రాలను సమర్పించినట్టు వారు తెలిపారు.

