Telangana Bandh: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పునకు నిరసనగా అక్టోబర్ 18న చేపట్టే రాష్ట్రవ్యాప్త బంద్‌కు తెలంగాణ బీసీ జేఏసీ కమిటీ సమాయత్తం అవుతున్నది. తీర్పు వెలువడిన వెంటనే బంద్‌కు పిలుపునిచ్చినా, కొన్ని కారణాల రీత్యా 18వ తేదీకి జేఏసీ కమిటీ వాయిదా వేసింది. బంద్‌ను పకడ్బందీగా చేపట్టేందుకు తెలంగాణ బీసీ జేఏసీ కమిటీ తీవ్రంగా కృషి చేస్తున్నది. ఈ మేరకు కమిటీ చైర్మన్ ఎంపీ ఆర్ కృష్ణయ్య, వైస్ చైర్మన్ వీజీఆర్ నారగోని, వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్, కోచైర్మన్ రాజారామ్ యాదవ్ విశేష కృషి చేస్తూ, బీసీలను సమన్వయం చేస్తున్నారు.
Telangana Bandh: అక్టోబర్ 18న రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ రూపొందించిన వాల్ పోస్టర్‌ను ఆర్ కృష్ణయ్య సహా తెలంగాణ బీసీ జేఏసీ కమిటీ ముఖ్య నేతలు తాజాగా ఆవిష్కరించారు. హైదరాబాద్ గన్‌పార్క్ వద్ద జరిగిన ఈ కార్యక్రమం అనంతరం వారు మాట్లాడుతూ బంద్ సందర్భంగా బస్సులు నడపొద్దని, విద్యాసంస్థలను తెరవొద్దని, వ్యాపార సముదాయాలను మూసి ఉంచాలని వారు పిలుపునిచ్చారు. ఆర్టీసీ యాజమాన్యం, విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు సహకరించాలని కోరారు.
Telangana Bandh: బీసీల సెగ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిసేలా బీసీలు ఈ బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ బీసీ జేఏసీ కమిటీ ముఖ్య నేతలు పిలుపునిచ్చారు. ఈ రాష్ట్ర బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని, అన్ని పార్టీల నేతలను తాము కలుస్తామని బీసీ నేతలు ప్రకటించారు. తాము చేపట్టిన బంద్‌కు మద్దతు ఇవ్వని పార్టీలకు బీసీల ఓట్లు అడిగే హక్కు లేదని బీసీ నేతలు హెచ్చరికలు జారీ చేశారు.