Telangana assembly:వచ్చే మార్చి 1 నుంచి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ సమావేశాలు ఐదు రోజుల పాటు అంటే మార్చి 5వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ ఐదురోజుల సమావేశాల్లో కీలకమైన బిల్లుల ఆమోదంతోపాటు ఆయా బిల్లులకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ మేరకు ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల అంశాలపై మూడు బిల్లులను సమావేశాల్లో ప్రవేశపెట్టి, ఆమోదించాలని నిర్ణయించింది.
Telangana assembly:వచ్చే నెల తొలి ఐదు రోజుల్లో జరిగే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ఆమోదించే ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల బిల్లులను రూపొందించే ప్రక్రియలో ఉన్నతాధికారులు ఉన్నారు. ముసాయిదాల రూపకల్పనలో వారు నిమగ్నమయ్యారు. త్వరలో వాటిని ప్రభుత్వానికి అందించనున్నారు. ఆ తర్వాత వాటిని మంత్రిమండలి ప్రత్యేకంగా సమావేశమై కూలంకశంగా చర్చించి, మార్పులు చేర్పులుంటే సవరించే అవకాశం ఉన్నది. ఆ తర్వాతే సభలో ప్రవేశపెట్టనున్నారు.
Telangana assembly:రాష్ట్రంలోని ఎస్సీలను మూడు గ్రూపులుగా వర్గీకరించాలంటూ ఏకసభ్య కమిషన్ ఇటీవలే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం మాల, మాదిగల్లోని ఉపకులాలన్నింటినీ మూడు గ్రూపులుగా విభజించింది. గ్రూపు-1లో సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, అత్యంత వెనుకబడిన, పట్టించుకోని కులాలను చేర్చి వారికి 1 శాతం రిజర్వేషన్ కల్పించింది. గ్రూప్-2లో ఒక మోస్తరు లబ్ధి పొందిన కులాలను చేర్చి వారికి 9 శాతాన్ని ప్రతిపాదించింది. గ్రూపు-3లో మెరుగైన ప్రయోజనాలను పొందిన కులాలను చేర్చి వారికి 5 శాతాన్ని కేటాయించింది.
Telangana assembly:రాష్ట్రంలోని 59 ఎస్సీ కులాలకు 15 శాతం రిజర్వేషన్లను కేటాయించింది. ఏకసభ్య కమిషన్ నివేదికను అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదం తెలపనున్నది. అయితే ఇటీవల వచ్చిన సూచనలు, వినతుల మేరకు ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే చేసే అవకాశం ఉన్నది. మరో గ్రూపును ఏర్పాటు చేసి రిజర్వేషన్లను కొంతమేరకు మార్పలు చేర్పులు చేసే అవకాశం ఉన్నదని ప్రచారం జరుగుతున్నది.
Telangana assembly:బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని తొలుత భావించిన ప్రభుత్వం.. ఆ తర్వాత విద్య, ఉద్యోగాల్లో కూడా వర్తింపజేయాలని నిర్ణయించింది. ఇప్పుడు ఉన్న 29 శాతం రిజర్వేషన్లను అదనంగా మరో 13 శాతం పెంచి ఏబీసీడీఈ విభాగాల వారీగా పంచాలని యోచిస్తున్నది. ఇప్పటికే అధికారులు కూడా ఆ మేరకు నివేదిక ముసాయిదాల రూపకల్పన చేస్తున్నారు.
Telangana assembly:ఈ మూడు బిల్లుల విషయంలో అన్నిరాజకీయ పార్టీలను కలుపుకొని పోవాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి త్వరలో అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాయనున్నట్టు తెలిసింది. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో బిల్లులను ఆమోదింపజేసిన అనంతరం, ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లనున్నారని సమాచారం. ఆయా బిల్లుల చట్టబద్ధతకు పార్లమెంట్‌లో ఆమోదం కోసం కేంద్రాన్ని కోరనున్నారని సమాచారం.

