Telangana assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ఆరంభానికి డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల (ఆగస్టు) 30 నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాదకుమార్ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. సమావేశాల నిర్వహణ తేదీలను నిర్ణయించేందుకు సభ ప్రారంభమైన రెండో రోజున బిజినెస్ అడ్వయిజరీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు ఆ నోటిఫికేషన్‌లోనే పేర్కొన్నారు. ఈ సమావేశానికి అన్ని పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు.
Telangana assembly: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్, విపక్షమైన బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధ తప్పదని అందరూ భావిస్తున్నారు. ఇరుపక్షాల మధ్య వాడీవేడి చర్చ సాగే అవకాశం ఉన్నదని చెప్తున్నారు. హైడ్రా, హైదరాబాద్‌లో హత్యలు, దోపిడీల వంటి అంశాలు బీఆర్ఎస్ పార్టీకి ఆయుధాలుగా మారనున్నాయి. అదే విధంగా వరదల నివారణ చర్యలు, వరద సహాయక చర్యలపై ప్రభుత్వ వైఖరిపై బీఆర్ఎస్ ఫైట్ చేసే అవకాశం ఉన్నది.
Telangana assembly: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఇచ్చిన నివేదికను సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలకు నోట్ పంపినట్టు సమాచారం. ఈ అంశంపై ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్‌ను, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఇరుకున పెట్టేందుకు అధికార పక్షం అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నది. దానిని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతున్నది. దీనిపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ అనుమతి కోసం వేచి చూస్తున్నది.
Telangana assembly: ఈ సారి సభకైనా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వస్తారా? రారా? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొన్నది. గతంలో రెండుసార్లు సభకు వచ్చిన ఆయన ఈ సారి ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై జరిగే చర్చలో పాల్గొని వాస్తవాలను సభ ముందు ఉంచుతారా? లేదా? అన్నదానిపై ఇంకా తేలలేదు. అదే విధంగా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే వేటు అంశం కూడా చర్చకు దారితీసే అవకాశం ఉన్నది. దీనిపైనా అధికార, విపక్షాల నడుమ వాదోపవాదాలు జరుగుతాయని తెలుస్తున్నది.