Telangana assembly: లగచర్ల రైతులకు మద్దతుగా నల్లటి దుస్తులతో నిన్న అసెంబ్లీకి వచ్చి నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బుధవారం వినూత్న రీతిలో ఆటో డ్రైవర్ల దుస్తులు ధరించి, ఆటోలను నడుపుకుంటూ అసెంబ్లీకి వచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే అయిన కేటీఆర్ కూడా ఆటో నడుపుకుంటూ వచ్చారు. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ నినాదాలు చేసుకుంటూ అసెంబ్లీలోకి అడుగు పెట్టారు.
Telangana assembly: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారని, ఇప్పటి వరకు 93 మంది ఆత్మహత్య చేసుకున్నారని, వారి జాబితాను గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వానికి ఇచ్చామని కేటీఆర్ సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలిపారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు మద్దతుగా ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.
Telangana assembly: ఆటో డ్రైవర్లకు రూ.12 వేల ఆర్థికసాయం అందించాలని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కోరారు. ఈ మేరకు ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఆటోలలో కార్మికుల దుస్తుల్లో బీఆర్ఎస్ సభ్యులు వచ్చిన విషయం తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఆటో కార్మికుల సమస్యలను త్వరలో తీరుస్తామని హామీ ఇచ్చారు.
