Weather Update: తెలుగు రాష్ట్రాల్లో భానుడు అప్పుడే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మార్చి నెల ప్రారంభంలోనే ఎండలు ముదిరిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతుండటంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో సగటున 34 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఏపీ వాతావరణం.. ఎక్కడ ఎలా ఉంది?
అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం సముద్ర మట్టానికి సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తులో గాలుల దిశలో మార్పులు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం పొడిగా ఉండనుంది.
ఉత్తర కోస్తా & యానాం: ఇక్కడ రాబోయే మూడు రోజుల పాటు పొడి వాతావరణమే ఉంటుంది. అక్కడక్కడా తెల్లవారుజామున పొగమంచు కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా & రాయలసీమ: మంగళ, బుధవారాల్లో వాతావరణం పొడిగా ఉంటుంది. అయితే, రాయలసీమలో రాబోయే 24 గంటల తర్వాత గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే సూచనలు ఉన్నాయి. అంటే ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉండబోతోంది.
తెలంగాణలో పరిస్థితి ఏంటి?
తెలంగాణలో కూడా ఎండల తీవ్రత తక్కువగానేమీ లేదు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు వాతావరణం పూర్తిగా పొడిగా ఉంటుంది. ముఖ్యంగా రానున్న 3 నుండి 4 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు మరో 2 నుండి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల మధ్యాహ్నం పూట బయటకు రావాలంటేనే ప్రజలు జంకే పరిస్థితి కనిపిస్తోంది.
జాగ్రత్తలు అవసరం!
వాతావరణంలో చోటు చేసుకుంటున్న ఈ మార్పుల వల్ల అటు ఎండలు, ఇటు ఉదయం పూట స్వల్పంగా పొగమంచు కురుస్తున్నాయి. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం వేళల్లో ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని, డీహైడ్రేషన్ బారిన పడకుండా నీరు ఎక్కువగా తీసుకోవాలని కోరుతున్నారు.
