Telangana: సంక్రాంతికి సంకలు లేవనీయదు.. శివరాత్రికి శివశివా అంటూ వెళ్లిపోతుంది.. ఏమిటీ? అంటే చలి అన్న నానుడి తెలుగులో పూర్వం నుంచి వినిపిస్తున్నది. శివరాత్రికి శివశివా అనుకుంటూ వెళ్లడం అంటుంచి సంక్రాంతికి చలి లేదు.. గిలి లేదు.. అనుకునే పరిస్థితులు తెలంగాణలో ఏర్పడ్డాయి. ఒక్కసారిగా ఈ వాతావరణంలో విభిన్న పరిస్థితులు నెలకొనడంపై రాష్ట్ర ప్రజలు సంతోషంతో ఉన్నారు. సంక్రాంతి ముందు వరకూ గజగజ వణుకుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చి పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో ఊపిరి పీల్చుకన్నారు.
Telangana: రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగినట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణంగా మహాశివరాత్రి వరకు కొనసాగాల్సిన చలికాలం సంక్రాంతికి ముందే వీడ్కోలు పలుకడం విశేషంగా మారింది. సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం సహా మరికొన్ని జిల్లాల్లో ఉదయం పూట ఇంకా మంచు కురుస్తున్నప్పటికీ పగటిపూట ఎండ తీవ్రత పెరుగుతూ వస్తున్నది.
Telangana: ఎముకలు కొరికే చలిగాలుల స్థానంలో ఇప్పుడు వెచ్చని గాలులు వీస్తున్నాయి. రానున్న రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 29 నుంచి 31 డిగ్రీల వరకు నమోదు కావచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీంతో ఇక ఈ చలికాలంలో రెండో దశ వీచిన చలిగాలులకు ఫుల్స్టాప్ పడినట్టేనని వారు స్పష్టం చేశారు. వచ్చే 10 రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే ఉంటాయని, తీవ్రమైన చలి తిరిగి వచ్చే అవకాశం అయితే లేదని తేల్చి చెప్తున్నారు.
Telangana: హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణ కొనసాగనున్నది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం వాతావరణం కొంత భిన్నంగా కనిపిస్తుందని వాతవావరణ నిపుణులు చెప్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో వాతావరణం మేఘావృతమై ఉండే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇదిలా ఉండగా, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని బీదర్ సరిహద్దు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు.
