TG Congress: తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన కొద్ది రోజుల్లోనే అంతర్గత విభేదాలు బహిర్గతమవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్‌లో ప్రతి మంత్రి తమ తామే ముఖ్యమంత్రులమన్న ధోరణితో వ్యవహరిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ప్రజా సమస్యలు, పరిపాలన.. మరోవైపు మంత్రుల మధ్య ‘పవర్ గేమ్’ కొనసాగుతుండటంతో కాంగ్రెస్ అధిష్టానం ఇబ్బందుల్లో పడింది.
ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎం రేవంత్‌పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఓజీ సినిమా టికెట్ ధరల పెంపుపై కూడా ఆయన సీఎం నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తమకుమార్ రెడ్డి సైతం సొంత నిర్ణయాలతో ముందుకెళ్తున్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇదే సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్, అడ్లూరి శ్రీనివాస్ మధ్య తలెత్తిన వివాదం అధిష్టానం జోక్యంతో తాత్కాలికంగా చల్లారింది. అయితే ఇప్పుడు కొత్తగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖల మధ్య ‘మంత్రివర్గ యుద్ధం’ చెలరేగింది.
మేడారం టెండర్లే ‘స్పార్క్’!
సమీప భవిష్యత్తులో జరగనున్న మేడారం జాతర టెండర్ల విషయంలో ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జోక్యం చూపడంపై కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.71 కోట్ల టెండర్‌ను తన అనుచరులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. దేవాదాయ శాఖకు తానే మంత్రి అయినా, పొంగులేటి తన అనుమతి లేకుండా అన్ని తానై వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు.
ఇది కూడా చదవండి: AP News: మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు
కొండా సురేఖ ఇప్పటికే ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డిని స్వయంగా కలుసుకుని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అంతేకాదు, పొంగులేటి తీరుతో ఇబ్బందిగా ఉందని ఆమె భర్త కొండా మురళీ కూడా గతంలో అధిష్టానానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది.
జిల్లాలో ఏకపక్ష నిర్ణయాలపై అసంతృప్తి
వరంగల్ ఇంచార్జ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే పొంగులేటి వ్యవహారశైలి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. స్థానిక అంశాల్లో, అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, తమతో సంప్రదించకుండా ముందుకెళ్తున్నారని కొండా సురేఖ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ అధిష్టానానికి కొత్త తలనొప్పి
ఇటీవల పొన్నం ప్రభాకర్, అడ్లూరి వివాదం తగ్గిందనుకున్న కాంగ్రెస్ సర్కార్‌కు ఇప్పుడు పొంగులేటి-కొండా తగాదా కొత్త తలనొప్పిగా మారింది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు, హైకోర్టు తీర్పులు, ప్రతిపక్ష ఒత్తిడితో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ.. మంత్రుల మధ్య తగాదాలు పార్టీ ఇమేజ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Nobel Peace Prize: ట్రంప్ కు నోబెల్ బహుమతి ఎందుకు రాలేదంటే?
ఇక అధిష్టానం చర్యలే కీలకం
సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే ఈ వివాదంపై స్పందిస్తారా? లేక మునుపటి లాగా పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని పరిస్థితిని సద్దుమణిగిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు ఐక్యంగా కనిపించిన తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు విభజన బాట పట్టిందనే మాటలు వెలువడుతున్నాయి. మంత్రుల మధ్య కొనసాగుతున్న ఈ “పవర్ వార్” రేవంత్ సర్కార్‌కు పరీక్షగా మారింది.