Tejaswini Nandamuri: నందమూరి కుటుంబం నుంచి మరో వారసురాలు ఇప్పుడు లైమ్‌లైట్‌లోకి వచ్చారు. ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని తొలిసారి కెమెరా ముందు మెరిసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పటివరకు తండ్రి సినిమాలకు సంబంధించిన నిర్మాణ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతూ వచ్చిన ఆమె, ఇప్పుడు నటిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు.
తెలుగు రాష్ట్రాల్లో పేరుగాంచిన ‘సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్’ తమ కొత్త బ్రాండ్ అంబాసడర్‌గా తేజస్వినిని ప్రకటించింది. ఈ యాడ్ షూట్ ఇటీవల పూర్తి కాగా, తాజాగా ఆ కమర్షియల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తేజస్వినీ అందం, స్మైల్, ఎక్స్‌ప్రెషన్స్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.
ఈ యాడ్ సాధారణ ప్రకటనలా కాకుండా, ఒక మినీ కాన్సెప్ట్ మూవీలా రూపొందించబడింది. ఇందులో తేజస్విని మొదట ఒక స్పోర్టీ, మోడ్రన్ లుక్‌లో ఇండోర్ రాక్ క్లైంబింగ్ చేస్తూ కనిపిస్తారు. ఆ సీన్‌లో ఆమె కష్టపడి గోడను ఎక్కిన తర్వాత చేతికి ఉన్న పెద్ద డైమండ్ రింగ్ మెరుస్తుంది. ఆ వెంటనే ఆమె రాయల్ బ్రైడ్ లుక్‌లోకి మారిపోతారు. ఈ మార్పు ద్వారా ఆధునికతతో పాటు సంప్రదాయాన్ని చూపించాలనే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది.
Also Read: Nara Rohith Wedding: ఘనంగా నారా రోహిత్ – శిరీషల వివాహం… హాజరైన చంద్రబాబు దంపతులు
ఈ ప్రమోషనల్ ఫిల్మ్‌కి వై.యమున కిషోర్ దర్శకత్వం వహించగా, ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారు. ఎస్.ఎస్. థమన్ అందించిన సంగీతం, ఐయాంకా బోస్ చిత్రీకరణ ఈ వీడియోను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాయి. తేజస్విని భర్త మాథుకుమల్లి భారత్, విశాఖపట్నం ఎంపీ, విద్యావేత్తగా పేరుపొందిన విషయం తెలిసిందే. ఆమె హుందాతనం, సంప్రదాయం, ఆధునికత కలయిక ఈ బ్రాండ్ ఇమేజ్‌కు కొత్త మెరుపు తీసుకొచ్చిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
‘సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్’ సంస్థను నాగిని ప్రసాద్ వేమూరి, శ్రీమణి మాథుకుమల్లి, శ్రీదుర్గా కత్రగడ్డ అనే ముగ్గురు మహిళా పారిశ్రామికవేత్తలు నడుపుతున్నారు. తేజస్విని భాగస్వామ్యంతో తమ బ్రాండ్ కళ, సౌందర్యం, ఎలిగెన్స్ అనే విలువలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం లభించిందని వారు పేర్కొన్నారు.
నందమూరి కుటుంబంలో ఎక్కువగా హీరోలు తెరపై మెరిసినా, ఆ ఫ్యామిలీ ఆడపిల్లలు సాధారణంగా ప్రొడక్షన్, బిజినెస్ వైపు దృష్టి సారిస్తారు. అయితే ఈసారి తేజస్విని కెమెరా ముందు రావడం అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్ అయింది. మొత్తం మీద, ఈ యాడ్ తేజస్విని కెరీర్‌కు కొత్త ఆరంభం మాత్రమే కాకుండా, నందమూరి వారసురాలిగా ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చిపెట్టింది.


