Teenmar Mallanna: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఆయన ఫిర్యాదు చేసిన ఓ కేసు విషయంలో ఆధారాలు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిపై పోలీసులు నమోదు చేసిన కేసులో ఫిర్యాదు దారైన తీన్మార్ మల్లన్నకు ఈ నోటీసులను జారీ చేసింది. పూర్తివివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.
Teenmar Mallanna: గతంలో నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తనకు వ్యతిరేకంగా నకిలీ వీడియోలను విడుదల చేశారని కేటీఆర్, జగదీశ్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో తీన్మార్ మల్లన్న ఫిర్యాదు చేశారు. నిరుడు మే నెల 25న వారిద్దరిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Teenmar Mallanna: తమపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ కేటీఆర్, జగదీశ్‌రెడ్డి ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పిటిషన్‌ను దాఖలు చేశారు. శుక్రవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. జస్టిస్ మౌసమీ భట్టాచార్య పిటిషనర్ల తరఫున న్యాయవాది వాదనలను వినిపించారు.
Teenmar Mallanna: వ్యక్తిగతంగా ఎవరిని ఉద్దేశించి కేటీఆర్, జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలు చేయలేదని న్యాయవాది టీవీ రమణారావు వాదించారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగా నమోదైన ఈ కేసును కొట్టేయాలని కేటీఆర్, జగదీశ్‌రెడ్డి తరఫు న్యాయవాది వాదించారు. వాదనల అనంతరం న్యాయమూర్తి ఇటు పోలీసులకు, తీన్మార్ మల్లన్నకు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు తదుపరి విచారణను జూన్ 13వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.