Alliance Air: హైదరాబాద్-తిరుపతి మధ్య నడిచే అలియన్స్ ఎయిర్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణికులకు పెద్ద ప్రమాదం తప్పింది. ఇటీవలి కాలంలో వరుసగా జరుగుతున్న విమాన ప్రమాదాలు, సాంకేతిక సమస్యలు ప్రయాణికుల్లో భయాన్ని పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఇవాళ తెల్లవారుజామున శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన ఈ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం ఆందోళన కలిగించింది.
పైలట్ చాకచక్యం..
విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్ విమానంలో సమస్యను గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన ఆయన, విమానాన్ని తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు మళ్లించారు. ఈ లోపాన్ని గుర్తించి, విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో అందులో ఉన్న 67 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. పైలట్ సమయస్ఫూర్తి వల్ల ఒక పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.
ప్రయాణికులను మరో విమానంలో తిరుపతికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సాంకేతిక సమస్యపై విమానయాన సంస్థ విచారణ ప్రారంభించింది. ప్రయాణికుల భద్రతే తమకు అత్యంత ముఖ్యమని ఎయిర్‌లైన్స్ అధికారులు పేర్కొన్నారు.