Air India: ఢిల్లీ నుండి విజయవాడకు బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం కారణంగా రెండు గంటల పాటు విమానం నిలిచిపోయింది. సోమవారం జరిగిన ఈ ఘటనలో విమానం టేకాఫ్ అయ్యే సమయంలో ఆటో-థ్రోటిల్ (వేగం నియంత్రించే వ్యవస్థ) సరిగా పని చేయలేదు. దీంతో, విమాన కెప్టెన్ సకాలంలో టేకాఫ్‌ను నిలిపేశారు.
ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 164 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ కూడా ఉన్నారు. అలాగే వృద్ధులు, చిన్నారులు, ఆరోగ్య సమస్యలతో ఉన్న వారు కూడా ఉన్నారు. ప్రయాణికులకు తక్షణ ఆహారం అందించాలని జస్టిస్ దేవానంద్ సూచించగా, సిబ్బంది వెంటనే ఆహారాన్ని అందించారు.
ఇది కూడా చదవండి: MP Sudha Ramakrishnan: మార్నింగ్ వాక్ చేస్తుండగా.. ఎంపీకి షాక్: చైన్ స్నాచింగ్!
విమానాన్ని తిరిగి పార్కింగ్ ప్రాంతానికి తీసుకెళ్లి, ఇంజినీరింగ్ బృందం తనిఖీలు ప్రారంభించింది. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌ను (CVR) డౌన్‌లోడ్ చేసి లోపం ఏమిటో గుర్తించేందుకు పరిశీలిస్తున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్తగా కెప్టెన్ తీసుకున్న నిర్ణయం వల్ల ప్రమాదం తప్పింది.
ఇక ఈ ఆలస్యం వల్ల, విజయవాడలో జస్టిస్ తుహిన్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జస్టిస్ దేవానంద్ హాజరుకాలేకపోయారు. ఎయిర్ ఇండియా యాజమాన్యం ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

