Techie Dies: రంగారెడ్డి జిల్లా మణికొండలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఇరువురి శాలిని (34) దుర్మరణం పాలయ్యారు. రాయదుర్గం పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా కందుకూరు – కొండముడుసుపాలెంకు చెందిన ఇరువురి శాలిని(34), వెంకటేశ్వర్లు దంపతులు ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. ఏడేళ్ల క్రితం హైదరాబాద్ కు వచ్చి మణికొండలోని పుప్పాలగూడ హేమదుర్గ శివహిల్స్ ప్రాంతంలోని బీఆర్‌సీ అపార్ట్‌మెంట్స్‌లోఉంటున్నారు. వీరికి సుదీక్ష(13), సహస్ర(9) పిల్లలున్నారు.
జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్ పాఠశాలలో చదువుతున్నారు. రోజూ స్కూల్ బస్సులోనే వెళ్లేవారు. అయితే మంగళవారం ఉదయం బస్సు వెళ్లిపోవటంతో శాలిని పిల్లలను స్కూటీపై తీసుకెళ్లింది. 4 కి.మీ.ల దూరంలోని రాయదుర్గం చౌరస్తా వద్ద బస్సును చేరుకుని పిల్లలను అందులో ఎక్కించారు. ఆమె ఇంటికి తిరిగి వస్తుండగా మణికొండ సుందర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ వద్దకు రాగానే నీటి ట్యాంకర్ స్కూటీని ఢీకొట్టింది. ఆమె కింద పడిపోగా ట్యాంకర్ వెనక చక్రం ఆమె తల మీదుగా వెళ్లింది. తీవ్ర గాయాలపాలైన శాలిని స్పాట్ లోనే మృతిచెందింది.
ఇది కూడా చదవండి: Cameron Green: ప్రపంచ రికార్డు సృష్టించిన ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్
రాయదుర్గం పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించి కేసు నమోదు చేశారు. రెండ్రోజుల క్రితం పనిమీద విజయవాడకు వెళ్లిన ఆమె భర్త వెంకటేశ్వర్లుకు సమాచారం ఇవ్వగా నగరానికి బయలుదేరారు. తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లటాన్ని చిన్నారులు జీర్ణించుకోలేకపోతున్నారు. వారు గుండెలవిసేలా రోదిస్తున్న తీరు స్థానికులను కంటనీరు పెట్టించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
