team india

Team India: పోస్టుమార్టం తప్పదు

Team India: ఓడిపోవడం తప్పు కాదు.. కానీ ఓటముల నుంచి పాఠాలు నేర్చుకోకపోవడం మళ్లీ అవే తప్పులు పునరావృతం చేయడం తప్పు. కివీస్ తో ముగిసిన మూడు టెస్టుల సిరీస్ లో టీమిండియా చేసిందదే. అందుకే వైట్ వాష్ పరాజయంతో భారీ మూల్యం చెల్లించుకుంది. వేడుకలకు ఇచ్చే విలువ.. ఓటమి పాఠాలకు ఇవ్వకపోతే ఏమవుతుందో తెలియాలి.  కివీస్ చేతిలో  టెస్టు సిరీస్‌ను కోల్పోయిన భారత్‌ ఇప్పుడేం చేస్తుంది? ఎలా కోలుకుంటుంది? ఇప్పుడు క్రికెట్ ప్రపంచం అంతా ఇదే చర్చ.

కివీస్‌తో మూడు టెస్టులూ ఓడిపోయి భారత్‌ తీవ్ర పరాభవం మూటగట్టుకుంది. తొలి టెస్టుతో కివీస్ కు భారత గడ్డపై 36 ఏళ్ల రికార్డు టెస్టు విజయం అప్పగించాం.  రెండో టెస్టుతో 12 ఏండ్ల అనంతరం స్వదేశంలో సిరీస్ విజయం కోల్పోయిన  రికార్డు ఇచ్చాం. మూడో టెస్టులో 24 ఏళ్ల తర్వాత వైట్ వాష్ రికార్డు ఇచ్చుకున్నాం. ఒక జట్టుకు, అందులోనూ టాప్‌ క్లాస్‌ ప్లేయర్లు ఉన్న చోట ఇంతకుమించిన పరాభవం ఉండదు.

అప్పుడే శ్రీలంక చేతిలో 2-0తో ఓడిపోయి మన దేశానికి వచ్చిన న్యూజిలాండ్‌ అనూహ్యమైన ఆట తీరుతో 3-0తో సిరీస్‌ గెలుచుకుంది. వాళ్ల ఆట ఎంత మెరుగుపడిందో ఈ నంబర్లే చెబుతాయి. అయితే 1-0తో వెనుకబడిన తర్వాత టీమిండియా ఏం చేసేంది. పోనీ 2-0 తర్వాత ఏం చేశాం. మూడో టెస్టు ఫలితం చూస్తుంటే ఏమీ చేయలేదనే అర్థమవుతోంది. మన బ్యాటర్ల ఆటతీరు మారలేదు. కుప్పకూలడంలో పసి కూనలను మించి ఆర్డినరీ ప్రదర్శనతో అభిమానులను తీవ్రంగా హర్ట్ చేసింది టీమిండియా.

ఇది కూడా చదవండి: Team India: ఈ పరాభవం కొన్ని తరాలు వెంటాడుతుంది

Team India: ఒకసారి టెస్టు సిరీస్ లో మన ఆటతీరు చూసుకుంటే తొలి టెస్టులో కివీస్‌ చేతిలో దారుణమైన ఓటమి తర్వాత.. మన జట్టు మీద ఫ్యాన్స్‌ నమ్మకం ఉంచారు. ఒక్కటే కదా ఓడింది.. రెండో టెస్టుతో లెక్క సరిచేస్తారు అని ఆశించారు. రెండో టెస్టుకు పిచ్‌ను మనకు తగ్గట్టుగా అంటే స్పిన్‌ పిచ్‌ను సిద్ధం చేసుకుని వచ్చారు. పిచ్‌ మారింది కానీ, మన బ్యాటర్ల తీరు మారలేదు. దీంతో అక్కడా ఓటమే. రెండు ఓటముల తర్వాత మన బ్యాటర్ల మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. ‘టర్నింగ్‌ ట్రాక్‌ మీద ఇలానేనా ఆడడటం.. కివీస్‌ కుర్రాళ్లకు వచ్చినంత ఆట కూడా మనవాళ్లు రాదా?’ అనే విమర్శలు వచ్చాయి.

అయితే ఈ సమయంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రియాక్షన్‌ విచిత్రంగా అనిపించింది. అంత పోస్ట్ మార్టమ్ చేయనవసరం లేదంటూ ఓవర్  కాన్ఫిడెన్స్‌ చూపించాడు. దీంతో మూడో టెస్టులో భారత్‌ దెబ్బతిన్న పులిలా తిరగబడుతుంది అంటూ ఎంతో ఆశగా మన ప్రేక్షకులు మ్యాచ్‌ చూడటం మొదలుపెట్టారు. ఈసారి కూడా మన బలమని ఇన్నాళ్లూ నమ్ముకున్న స్పిన్‌నే ఆయుధంగా తీసుకొని కివీస్‌ మన బ్యాటర్లను బోల్తా కొట్టించింది.

ALSO READ  Gaddar Film Awards: గ‌ద్ద‌ర్ సినీ అవార్డుల ప్ర‌దానోత్స‌వంలో సీఎం రేవంత్‌రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు.. ఆసాంతం సంద‌డిగా సాగిన ఫంక్ష‌న్‌

దీంతో ఏకంగా 35 మంది నెట్‌ బౌలర్లతో ప్రాక్టీస్‌ చేసిన మన బ్యాటర్ల శ్రమ వృథా అయింది. రోజూ ఉదయం లేచి స్వీప్‌, రివర్స్‌  స్వీప్‌, ప్యాడల్‌ స్వీప్‌ అంటూ బ్యాటుతో ఊడ్చారు. కానీ, గ్రౌండ్‌లోకి వచ్చాక అవేవీ అమలు చేయలేదు. ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు మన స్టార్‌ బ్యాటర్లు. దీంతో క్లీన్ స్వీప్ తో భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత బాధాకరమైన ఓటమి ఎదురైంది.

ఇప్పటివరకు విదేశాల్లో మన బ్యాటర్లు తేలిపోయారంటే  అక్కడి పిచ్‌ల మీద, మైదానాల మీద అవగాహన, ఆడిన అనుభవం లేదని చెప్పొచ్చు. కానీ సొంత దేశంలో స్పిన్‌ బాగా ఆడతారనే పేరున్న మన బ్యాటర్లు వికెట్లను సమర్పించుకోవడం క్షమార్హం కాదు. ఇందుకు  కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. అందులో ముఖ్యమైనది దేశవాళీ క్రికెట్‌ ఆడకపోవడం. డొమెస్టిక్‌ క్రికెట్‌ ఆడటం మన స్టార్లు ఎప్పుడో మానేశారు. పదేళ్లకుపైగా డొమెస్టిక్‌ ముఖం చూడని స్టార్లు మన దగ్గర ఉన్నారు. దీంతో వైవిధ్యమైన బౌలింగ్‌ను గంటల తరబడి ఎదుర్కొనే ఛాన్స్‌ మిస్‌ అయ్యారు. ఎక్కువ సేపు క్రీజులో నిలుచుంటే ఆటోమేటిగ్గా పరుగులు వస్తాయి, విజయాలు వస్తాయి అనే పాయింట్‌ మిస్ అయ్యారు. దీంతో టెస్టు ఫార్మాట్  మీద వారికి పట్టు తగ్గింది. 

ఇది కూడా చదవండి: Cricket: వైట్ వాష్ అయిన భారత్

Team India: తాజాగా ముగిసిన కివీస్‌ సిరీస్ చూసుకుంటే .. నిన్న కాక మొన్న వచ్చిన జూనియర్లు గిల్‌, యశస్వి, పంత్‌ లాంటివాళ్లు బంతిని చూసి ఆడితే.. ఆట మీద ఏళ్ల తరబడి అవగాహన ఉన్న రోహిత్‌, విరాట్‌ బంతి ఎక్కడుందో తెలియనట్లు ఆడారు. ఒక్క ఇన్నింగ్స్‌తో జట్టులో స్థానం పక్కా చేసుకున్న సర్ఫరాజ్‌ అనవసర షాట్లకు పోయాడు. దీంతో బౌలర్ల శ్రమ కాస్త బూడిదలో పోసిన  పన్నీరు అయింది.

మొత్తం సిరీస్‌లో పాజిటివ్‌ ఫలితం ఏంటంటే.. మన బౌలర్ల కష్టం. అవకాశం వచ్చిన ప్రతి బౌలరూ రాణించాడు. అయిందేదో అయిపోయింది. ఎలాగూ మనకు అనుకూలంగా రాలేదు. కనీసం ఓటములు నేర్పిన పాఠాలైనా మనం నేర్చుకుందామా? లేక ఇదో పీడకల అని వదిలేస్తామా అనేది టీమ్‌ ఇండియా చేతిలో ఉంది. రెండో టెస్టు తర్వాత రోహిత్‌ అక్కర్లేదన్నా ఆ పోస్ట్‌మార్టమ్‌ ఇప్పుడు అత్యవసరం అని ఫ్యాన్స్, మాజీలు మొత్తుకుంటున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *