Modi-Priyanka Gandhi: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. డిసెంబర్ 1న ప్రారంభమైన ఈ సమావేశాలు మొత్తం 19 రోజుల పాటు కొనసాగాయి. చివరి రోజున లోక్‌సభ, రాజ్యసభలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉభయసభలకు హాజరయ్యారు.
సమావేశాల చివరి రోజున లోక్‌సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్)’గా పేరున్న వీబీ-జీ రామ్‌జీ బిల్లుకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ప్రశ్నోత్తరాల సమయంలో సభా కార్యకలాపాలను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో సభను కొనసాగించడం సాధ్యం కాదని భావించిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేశారు. ఇదే బిల్లు మూజువాణి ఓటు ద్వారా రాజ్యసభలో కూడా ఆమోదం పొందింది.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బదులుగా తీసుకొచ్చిన ఈ కొత్త బిల్లే సమావేశాల చివరిదశలో పెద్ద దుమారం రేపింది. విపక్ష సభ్యులు బిల్లు ప్రతులను చింపి, నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అయినప్పటికీ నిరసనల మధ్యే బిల్లుకు ఆమోదం లభించింది.
Also Read: Ponnam Prabhakar: కాలుష్య నియంత్రణే లక్ష్యం
రాజ్యసభను కూడా శుక్రవారం నిరవధికంగా వాయిదా వేశారు. రాజ్యసభ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ 269వ రాజ్యసభ సమావేశాలు ముగిసినట్లు ప్రకటించారు. తనను చైర్మన్‌గా ఎంపిక చేసినందుకు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సభా కార్యక్రమాలు మొత్తం సంతృప్తికరంగా జరిగాయని, జీరో అవర్, ప్రశ్నోత్తరాల సమయం ఉపయోగకరంగా కొనసాగిందని చెప్పారు.
సమావేశాల ముగింపు సందర్భంగా సంప్రదాయం ప్రకారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఎంపీలకు తేనీటి విందు ఏర్పాటు చేశారు. పార్లమెంట్ భవనంలోని తన ఛాంబర్‌లో జరిగిన ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ, సుప్రియా సూలే సహా అధికార, ప్రతిపక్షాలకు చెందిన పలువురు ఎంపీలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ అనౌపచారిక సమావేశంలో పలు అంశాలపై స్నేహపూర్వకంగా చర్చ జరిగినట్లు సమాచారం. వయనాడ్ నియోజకవర్గానికి సంబంధించిన విషయాలను ప్రియాంకా గాంధీ ప్రస్తావించగా, ప్రధాని మోదీ ఆసక్తిగా స్పందించినట్లు తెలుస్తోంది. వయనాడ్ అడవుల్లో దొరికే ఒక మూలికను ఉపయోగించడం వల్ల తన అలర్జీ సమస్య తగ్గిందని ప్రియాంక ఈ సందర్భంగా చెప్పినట్లు సమాచారం.
