Balakrishna: సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కార్యకర్తలు గట్టిగా డిమాండ్ చేశారు.
తాజాగా, హిందూపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన బాలకృష్ణకు ఈ డిమాండ్ ఎదురైంది. హిందూపురం మండలం కిరీకేర పంచాయతీలోని బసవనపల్లి ZPHSలో రూ. 64 లక్షల ఖర్చుతో కొత్తగా కట్టిన స్కూల్ భవనాన్ని బాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో కాసేపు మాట్లాడారు.
నినాదాలతో హోరెత్తించారు
కార్యక్రమం ముగించుకుని బాలకృష్ణ తిరిగి వస్తున్న సమయంలో, బసవనపల్లి వద్ద అభిమానులు, కార్యకర్తలు ప్లకార్డులు పట్టుకొని రోడ్డుపై నినాదాలు చేశారు. “బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలి!” అని పెద్ద పెట్టున నినదించారు.
కార్యకర్తలు మాట్లాడుతూ, బాలకృష్ణకు మంత్రి పదవికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయని, ఆయనకు కచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని కోరారు. “జై బాలయ్య” అంటూ నినాదాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు.
అసంతృప్తిలో కార్యకర్తలు
బాలకృష్ణ ఇప్పటికే మూడు సార్లు హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా, ఇంతవరకు ఆయనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
గతంలో బాలయ్య కూడా తాను మంత్రి పదవికి అర్హుడినే అని చెప్పినప్పటికీ, ఈ విషయంపై నేరుగా బహిరంగంగా మాట్లాడటం లేదు. అయితే, ఇప్పుడు కార్యకర్తలు స్వయంగా రోడ్డుపైకి వచ్చి డిమాండ్ చేయడంతో, ఈ విషయం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై బాలకృష్ణ గానీ, పార్టీ పెద్దలు గానీ ఎలా స్పందిస్తారో చూడాలి.