Ontimitta ZPTC by-election: కడప జిల్లాలో జరిగిన ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) విజయ దుందుభి మోగించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)పై టీడీపీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డి 6,267 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ గెలుపుతో టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.
ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కడప పాలిటెక్నిక్ కళాశాలలో జరిగింది. రెండు రౌండ్లలో జరిగిన కౌంటింగ్‌లో టీడీపీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డికి 12,780 ఓట్లు లభించగా, వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డికి 6,513 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో వైసీపీ అభ్యర్థిని ముద్దుకృష్ణారెడ్డి 6,267 ఓట్ల తేడాతో ఓడించారు.
Also Read: Pulivendula ZPTC by-election: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ ఘన విజయం
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ విజయం సాధించిన వెంటనే, ఒంటిమిట్టలోనూ అదే పార్టీ గెలుపొందడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు గెలుపులు టీడీపీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. అయితే, ఈ ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ కౌంటింగ్‌ను బహిష్కరించింది. ఈ ఫలితాలు కడప జిల్లాలో టీడీపీకి ఉన్న పట్టును, బలమైన పుంజుకుంటున్న వైఖరిని స్పష్టం చేస్తున్నాయి.