Raja Singh: భగవద్గీత గురించి టీడీపీ ఎమ్మెల్యే, టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుడు అయిన ఎంఎస్ రాజు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం మాత్రమే దేశ ప్రజలందరికీ పవిత్రమైందని, బైబిల్, ఖురాన్, లేదా భగవద్గీత వంటి గ్రంథాల వల్ల ప్రజల జీవితాలు మెరుగుపడలేదని, కేవలం రాజ్యాంగం వల్లే సామాన్యుల విధి మారిందని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే, ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు ఎంఎస్ రాజు కామెంట్లను తీవ్రంగా ఖండించారు. భగవద్గీత పట్ల నమ్మకం లేని రాజును వెంటనే టీటీడీ బోర్డు సభ్యత్వం నుంచే కాకుండా, పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. టీటీడీ సభ్యులను నియమించేటప్పుడు, వారికి హిందూ మతం, భగవద్గీత, సంప్రదాయాల పట్ల గౌరవం ఉందో లేదో సరిగా పరీక్షించాలని ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరారు.
అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ గారు కూడా ఎంఎస్ రాజు వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించారు. రాజు కేవలం ఎమ్మెల్యే మాత్రమే కాదని, కోట్లాది మంది హిందువులు పవిత్రంగా భావించే భగవద్గీతను తక్కువ చేసి మాట్లాడటం చాలా దురదృష్టకరమని మాధవ్ అన్నారు. వెంటనే ఎమ్మెల్యే ఎంఎస్ రాజు హిందువులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.


