Maleapati Subbaraidu: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు (75) సోమవారం తెల్లవారుజూమున తుదిశ్వాస విడిచారు.. గత పది రోజులుగా బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా విజయవాడలోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో మృతి చెందారు.
ఈ విషాదం నెల్లూరు జిల్లా, ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో విషాద వాతావరణాన్ని నెలకొల్పింది. నిన్న (ఆదివారం) ఆయన అన్న కుమారుడు భానుచందర్ నాయుడు అకాల మరణం చెందగా, ఈ రోజు సుబ్బానాయుడు మరణించడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
“నిబద్ధత కలిగిన నాయకుడిని కోల్పోయాం” – సీఎం చంద్రబాబు
సుబ్బానాయుడు మృతి వార్త తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
“సుబ్బానాయుడు త్వరగా కోలుకొని ఆసుపత్రి నుంచి తిరిగి వస్తారని ఆశించాను. కానీ ఆయన అకాల మరణం నన్ను ఎంతో కలిచివేసింది. కావలి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంలో ఆయన శ్రమ మరపురానిది” అని పేర్కొన్నారు.
“నిబద్ధత, అంకితభావం కలిగిన నాయకుడిని కోల్పోవడం బాధాకరం. సుబ్బానాయుడు మృతి పార్టీకి తీరని లోటు” అని అన్నారు.
సుబ్బానాయుడు కుటుంబ సభ్యులకు, బంధువులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, పార్టీ ఎల్లప్పుడూ కుటుంబానికి అండగా ఉంటుందనే భరోసా ఇచ్చారు.
“పార్టీకి అండగా నిలిచిన విశ్వసనీయ నేత” – మంత్రి నారా లోకేశ్
ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేశ్, ఎక్స్ (Twitter) ద్వారా సంతాపం తెలిపారు. “మాలేపాటి సుబ్బానాయుడు గారు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి, కావలి టీడీపీ ఇన్‌చార్జ్‌గా ప్రజల కోసం, పార్టీ బలపరచడంలో విశేష కృషి చేశారు. ఆయన మరణం పార్టీకి అపార నష్టం” అని పేర్కొన్నారు. “సుబ్బానాయుడు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి” అని తెలిపారు.
ఇది కూడా చదవండి: UPI Payments: దేశంలో రికార్డు స్థాయిలో యూపీఐ చెల్లింపులు..
“నెల్లూరు టీడీపీకి ఆయన కృషి ఎనలేని ది” – మంత్రి నారాయణ
మంత్రి డా. పొంగూరు నారాయణ కూడా సుబ్బానాయుడు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. “నెల్లూరు జిల్లాలో టీడీపీ బలోపేతానికి ఆయన చేసిన సేవలు గుర్తుంచుకోదగ్గవే. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పార్టీని కూటమి అధికారంలోకి తీసుకురావడంలో ఆయన పాత్ర విశేషమైనది” అని అన్నారు. సుబ్బానాయుడు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
పార్టీకి తీరని లోటు
పార్టీ కార్యకర్తల నుండి నాయకుల వరకు అందరూ మాలేపాటి సుబ్బానాయుడిని సాధారణ కార్యకర్తల నుండి ఎదిగిన క్రమశిక్షణ గల నేతగా గుర్తిస్తున్నారు. పార్టీ పట్ల నిబద్ధత, ప్రజల పట్ల నిజాయితీ, అభివృద్ధిపైన దృష్టి ఇవే ఆయన రాజకీయ ప్రయాణానికి మూలాధారం. ఆయన మరణం తెలుగుదేశం పార్టీకే కాకుండా, నెల్లూరు జిల్లా రాజకీయాలకు కూడా పెద్ద లోటు అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.