TDGP: ఆస్ట్రేలియా కాల్పుల నిందితుడు సాజిద్ హైదరాబాద్ వాడే

TDGP: ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో బాండీ బీచ్ వద్ద జరిగిన ఘోర కాల్పుల ఘటనకు హైదరాబాద్‌తో సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఈ దాడిలో ప్రధాన నిందితుడిగా గుర్తించబడిన సాజిద్ అక్రమ్ (50) హైదరాబాద్‌కు చెందిన వ్యక్తేనని తెలంగాణ డీజీపీ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. ఈ ఘటన అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర కలకలం రేపింది.

తెలంగాణ డీజీపీ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, సాజిద్ అక్రమ్ హైదరాబాద్‌లో బీకామ్ పూర్తి చేశాడు. సుమారు 27 ఏళ్ల క్రితం, 1998లో ఉన్నత విద్య కోసం స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అక్కడే స్థిరపడిన అతడు యూరప్‌కు చెందిన వెనెరా గ్రోసో అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు నవీద్ అక్రమ్ (24), ఒక కుమార్తె ఉన్నారు. ఇద్దరూ ఆస్ట్రేలియా పౌరసత్వం కలిగి ఉన్నారు.

ఇటీవల సిడ్నీలోని బాండీ బీచ్‌లో యూదులు హనుక్కా ఉత్సవాలు జరుపుకుంటున్న సమయంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. సాజిద్ అక్రమ్ తన కుమారుడు నవీద్‌తో కలిసి విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో 15 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో సాజిద్ అక్రమ్ అక్కడికక్కడే హతమయ్యాడు. అతని కుమారుడు నవీద్‌ను అధికారులు అరెస్టు చేశారు.

 

ఈ దాడి వెనుక ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ప్రభావం ఉండవచ్చని ఆస్ట్రేలియా అధికారులు అనుమానిస్తున్నారు. దీనిని యూదు వ్యతిరేక ఉగ్రవాద దాడిగా ఆ దేశ ప్రభుత్వం పరిగణిస్తోంది. అంతర్జాతీయ దర్యాప్తు సంస్థల సహకారంతో కేసును లోతుగా విచారిస్తున్నారు.

 

డీజీపీ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం, సాజిద్ అక్రమ్ ఆస్ట్రేలియాలో స్థిరపడినప్పటికీ ఇప్పటికీ హైదరాబాద్ నుంచి జారీ చేసిన భారత పాస్‌పోర్టునే వినియోగిస్తున్నాడు. కుటుంబ, ఆస్తి వ్యవహారాల నిమిత్తం అతడు ఇప్పటివరకు ఆరుసార్లు భారత్‌కు వచ్చినట్లు గుర్తించారు. అయితే హైదరాబాద్‌లో అతనిపై ఎలాంటి నేర చరిత్ర లేదని అధికారులు స్పష్టం చేశారు.

 

ఒకప్పుడు హైదరాబాద్‌లో చదువుకున్న వ్యక్తి అంతర్జాతీయ ఉగ్రవాద దాడిలో ప్రధాన నిందితుడిగా మారడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు దారి తీసిన కారణాలు, అతడిలో చోటుచేసుకున్న మార్పులపై లోతైన విచారణ కొనసాగుతోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *