Tata Group

Tata Group: ఏపీకి మరో భారీ ప్రాజెక్టు.. నెల్లూరు లో టాటా పవర్ భారీ పెట్టుబడి!

Tata Group: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో నూతన శకం మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యతతో ప్రముఖ దిగ్గజ సంస్థ టాటా గ్రూప్ నెల్లూరు జిల్లాలో భారీ సెమీకండక్టర్, సోలార్ విడిభాగాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. సుమారు 6,675 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో రాష్ట్రానికి వస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా నెల్లూరు ప్రాంతం దేశంలోనే ఒక కీలకమైన సోలార్, సెమీకండక్టర్ హబ్‌గా రూపాంతరం చెందనుంది. ముఖ్యంగా సెమీకండక్టర్ చిప్ తయారీలో అత్యంత కీలకమైన ‘ఇంగోట్, వాఫర్’లను ఇక్కడ ఉత్పత్తి చేయనున్నారు. దేశంలోనే అతిపెద్ద ఇంగోట్-వాఫర్ ప్లాంట్‌గా గుర్తింపు పొందనున్న ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ భారీ కర్మాగారం కోసం నెల్లూరు సమీపంలోని ఇఫ్కో కిసాన్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (SEZ)లో ప్రభుత్వం 200 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో భాగంగా 120 ఎకరాల్లో ప్లాంట్ నిర్మాణం ప్రారంభం కానుండగా, భవిష్యత్ అవసరాలు విస్తరణ కోసం మరో 80 ఎకరాలను రిజర్వ్ చేసి ఉంచారు. ఒడిశా నుంచి ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చూపిన చొరవ ఫలించింది. రాష్ట్రంలో ఉన్న మౌలిక సదుపాయాలు, కృష్ణపట్నం పోర్టు సామీప్యత, ప్రభుత్వ పారదర్శక విధానాల వల్ల టాటా గ్రూప్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు లభించడమే కాకుండా, పరోక్షంగా వేలమందికి ఉపాధి లభిస్తుంది.

Also Read: MLA: నేను ఇక పోటీ చేయను.. బీజేపీ ఎమ్మెల్యే కీలక నిర్ణయం

సెమీకండక్టర్ రంగంలో ఇంగోట్, వాఫర్లు ప్రాథమిక పునాది వంటివి. సిలికాన్ వంటి పదార్థాలను కరిగించి ఇంగోట్లుగా మార్చి, వాటిని సన్నని పొరలుగా కోయడం ద్వారా వాఫర్లను తయారు చేస్తారు. ఈ వాఫర్లపైనే సెమీకండక్టర్ చిప్‌లను నిర్మిస్తారు. నెల్లూరులో నిర్మించబోయే ఈ ప్లాంట్ 10 గిగావాట్ల సామర్థ్యంతో పనిచేయనుంది. ఈ పరిశ్రమకు అవసరమైన విద్యుత్ కోసం టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (TPREL) ప్రత్యేకంగా 200 మెగావాట్ల గ్రీన్ పవర్ ప్లాంట్‌ను కూడా అక్కడే ఏర్పాటు చేయబోతోంది. తద్వారా పర్యావరణహితంగా ఇంధన అవసరాలను తీర్చుకోనున్నారు. ఈ ప్లాంట్ అందుబాటులోకి వస్తే సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీలో ఇతర దేశాలపై మన ఆధారపడటం తగ్గుతుంది.

ఈ ప్రతిష్టాత్మక పెట్టుబడిపై మంత్రి నారా లోకేష్ సంతోషం వ్యక్తం చేస్తూ, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలకు ఆకర్షణీయ గమ్యంగా మారిందని అభివర్ణించారు. స్థిరమైన ప్రభుత్వం, అత్యుత్తమ విధానాలు ఉండటం వల్లే టాటా వంటి అంతర్జాతీయ స్థాయి సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని ఆయన తెలిపారు. నెల్లూరులో పెరుగుతున్న ఈ భారీ పెట్టుబడులు జిల్లా రూపురేఖలను మార్చడమే కాకుండా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఎత్తున ఊతాన్ని ఇవ్వనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *