Tata Capital: భారతదేశంలో మరో భారీ ఐపీఓ (Initial Public Offering) రానుంది. టాటా గ్రూప్‌కు చెందిన టాటా క్యాపిటల్ స్టాక్ మార్కెట్‌లో ప్రవేశించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఇటీవలే బోర్డు నుంచి ఆమోదం పొందిన ఈ కంపెనీ, ఐపీఓ ద్వారా మార్కెట్లోకి రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం టాటా క్యాపిటల్ మార్కెట్ విలువ 11 బిలియన్ డాలర్లుగా లెక్కించబడింది.
సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం, ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా దాదాపు 2 బిలియన్ డాలర్లు సమీకరించే అవకాశం ఉంది. కంపెనీ 23 కోట్ల కొత్త షేర్లను విడుదల చేయనుంది. అలాగే, ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా మరికొన్ని షేర్లను జారీ చేయనుంది. అయితే, ఐపీఓకు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
ఇటీవల టాటా టెక్నాలజీస్ బంపర్ లిస్టింగ్ అనంతరం, టాటా గ్రూప్ నుంచి మరో పెద్ద ఐపీఓ రావడం మదుపర్లలో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Tata Capital: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకారం, “టాటా క్యాపిటల్ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC)”గా గుర్తింపు పొందింది. RBI నిబంధనల ప్రకారం, NBFCలు మూడేళ్లలోపు తమ షేర్లను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయడం తప్పనిసరి. అంటే, 2025 సెప్టెంబర్ నాటికి టాటా క్యాపిటల్ షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావాల్సి ఉంటుంది.
ఇదే నేపథ్యంలో, దాదాపు రెండు దశాబ్దాల తర్వాత టాటా గ్రూప్ నుంచి మరో భారీ ఐపీఓ రానుండటంతో మార్కెట్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.