Nagarjuna: టాలీవుడ్ ‘కింగ్’ అక్కినేని నాగార్జున తన కెరీర్‌లోని ప్రతిష్టాత్మక 100వ సినిమాను ఇటీవల మొదలుపెట్టారు. ఈ సినిమాకు ‘లాటరీ కింగ్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ ప్రాజెక్ట్‌కు తమిళ దర్శకుడు ఆర్. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంపై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
నాగ్-టబు కాంబో మ్యాజిక్ రిపీట్?
తాజా సమాచారం ప్రకారం, సీనియర్ నటి టబు ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో భాగం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో నాగార్జున, టబు కలిసి నటించిన ‘నిన్నే పెళ్లాడతా’ (1996), ‘ఆవిడా మా ఆవిడే’ (1998) సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడమే కాకుండా, టాలీవుడ్‌లో ఒక క్లాసిక్ చిత్రంగా నిలిచింది. ఈ రెండు సినిమాల్లో నాగ్-టబు కెమిస్ట్రీ యూత్‌కు బాగా నచ్చింది. 1998 తర్వాత వీరు మళ్లీ కలిసి నటించకపోయినా, వీరి మధ్య స్నేహం మాత్రం కొనసాగింది.
Also Read: SSMB29: Gen 63 కాదు.. మహేష్ రాజమౌళి సినిమాకు కొత్త టైటిల్ ఫిక్స్.. !
కీలక పాత్రలో టబు?
‘లాటరీ కింగ్’ చిత్రంలో టబు నటిస్తున్నట్లు వస్తున్న వార్తలతో పాత అభిమానుల్లో సంతోషం నెలకొంది. అయితే, ఆమె హీరోయిన్‌గా కాకుండా, కథకు కీలకమైన, బలమైన పాత్రను పోషిస్తారని సినీ వర్గాలు చెబుతున్నాయి. టబు నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఈ విషయంలో అధికారిక ప్రకటన కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.