AP News: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థిని యార్లగడ్డ రాజ్యలక్ష్మి (23) అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ సంఘటన అగ్రరాజ్యం అమెరికాలో చోటుచేసుకుంది. టెక్సాస్‌లోని ఏ అండ్ ఎమ్ యూనివర్సిటీ-కార్పస్ క్రిస్టి నుంచి పట్టభద్రురాలైన రాజ్యలక్ష్మి, అక్కడే ఉంటూ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో నవంబర్ 7, 2025న అపార్ట్‌మెంట్‌లో అకస్మాత్తుగా మరణించింది. ఆమెది ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా, కర్మెచెడు గ్రామం.
రాజ్యలక్ష్మి మరణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. రెండు రోజులుగా ఆమె తీవ్రమైన దగ్గు, ఛాతీ నొప్పితో బాధపడుతుందని స్నేహితులు చెబుతున్నారు. నవంబర్ 7న ఉదయం లేపగా ఆమె మేల్కొనకపోవడంతో స్నేహితులు ఈ విషయాన్ని గుర్తించారు. అయితే, మరణానికి కచ్చితమైన కారణం తెలియాలంటే వైద్య పరీక్షల రిపోర్ట్ వచ్చేవరకు ఆగాల్సిందేనని పోలీసులు తెలిపారు.
అమెరికాకు ఎన్నో కలలతో పంపిన కుమార్తె మరణవార్త తెలుసుకుని బాపట్లలోని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. రైతు కుటుంబానికి చెందిన రాజ్యలక్ష్మి మృతదేహాన్ని ఆంధ్రప్రదేశ్‌కు పంపించేందుకు ఆమె బంధువు చైతన్య, టెక్సాస్‌లో అవసరమైన నిధులు సేకరిస్తున్నారు.

