Suryapet:సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన ఓ దళిత యువకుడు కర్ల రాజేశ్ కస్టడీ మరణంపై తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మృతదేహంతో గడిచిన రెండు రోజులుగా వివిధ సంఘాలు, పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం దిగిరావాలని, యువకుడి మరణానికి కారకులైన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని కోరుతూ ఆందోళన నిర్వహిస్తున్నారు. లిఖిత పూర్వక హామీ ఇస్తేనే ఆందోళనను విరమిస్తామని ఆందోళనకారులు భీష్మించుకొని నిన్న రాత్రి నుంచి ఆందోళన నిర్వహిస్తున్నారు.
అసలు ఏం జరిగింది?
Suryapet:కోదాడ నియోజకవర్గం పరిధిలోని చిలుకూరు మండల కేంద్రానికి చెందిన కొడారు రాజేశ్ అనే వ్యక్తి అనారోగ్యంతో చికిత్స పొంది సీఎంఆర్ఎఫ్ సాయం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ మేరకు ఆయన పేరిట రూ.1,00,000 సీఎంఆర్ఎఫ్ నగదు మంజూరైంది. కానీ ఆ చెక్కు అతనికి చేరలేదు. వాకబు చేయగా, అతనికి వచ్చిన నగదును కొందరు డ్రా చేసుకున్నారని తెలియడంతో చిలుకూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Suryapet:పోలీసుల విచారణలో అసలు బాగోతం బయటపడింది. కడారు రాజేశ్‌కు వచ్చిన ఆ చెక్కు అసలు లబ్ధిదారుడికి చేరకుండానే కొందరు అక్రమార్కులు కాజేయాలన్న పన్నాగం పన్నారు. కోదాడకు చెందిన కర్ల రాజేశ్‌కు రూ.3,000 ఇచ్చి అతని ఖాతాలో చెక్కు వేసి డ్రా చేసుకున్నారు. దీనిపై కర్ల రాజేశ్‌ను విచారణ కోసం పోలీసులు అదుపులోకి తీసుకొని హుజూర్‌నగర్ కోర్టు రిమాండ్‌కు తరలించింది.
Suryapet:ఈలోగా జైలులో ఉన్న కర్ల రాజేశ్ అనారోగ్యంతో తొలుత హుజూర్‌నగర్ ఆసుపత్రి, ఆ తర్వాత సూర్యాపేట జిల్లా ఆసుపత్రి, ఆ తర్వాత సికింద్రాబాద్ గాంధీ దవాఖానకు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు చెప్తున్నారు. అయితే ముమ్మాటికీ పోలీసుల చిత్రహింసలతోనే తన కుమారుడు చనిపోయాడని మృతుడి తల్లి ఆరోపిస్తున్నది. కర్ల రాజేశ్‌ది లాకప్‌డెత్ మరణమని దళిత, ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు.
ఆందోళన తీవ్రరూపం
Suryapet:కర్ల రాజేశ్ కుటుంబానికి పరిహారం చెల్లించాలని, ఆ ఇంటిలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ ఆందోళనకారులు కోదాడ పట్టణంలో గత రెండు రోజుల నుంచి ఆందోళన నిర్వహిస్తున్నారు. ధర్మస్వరాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విశారధన్ మహరాజ్, ఇతర పార్టీల నేతలు, దళిత సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే పద్మావతి, జిల్లా కలెక్టర్ స్వయంగా వచ్చి లిఖిత పూర్వక హామీ ఇస్తేనే ఆందోళనను విరమిస్తామని భీష్మించుకొని కూర్చున్నారు. ఆర్డీవో హామీ ఇచ్చినా ససేమిరా అనడంతో నిన్న రాత్రి నుంచి ఆందోళన కొనసాగుతున్నది. ఇది ఏ పరిణామానికి దారితీస్తుందో వేచి చూడాలి మరి.

