Suryapet : గిరిజన బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కలకలం

Suryapet: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల వసతి గృహంలో భోజనం వికటించి 22 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా వాంతులు చేసుకోవడంతో మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో వారిని అర్బన్ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అయితే, చికిత్స అనంతరం కూడా కోలుకోకపోవడంతో సాయంత్రం 4 గంటలకు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.

తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వని అధికారులు

ఘటన జరిగి గంటలు గడిచినా, విద్యార్థినుల తల్లిదండ్రులకు అధికారులు ఎలాంటి సమాచారం అందించలేదు. పిల్లలు ఎక్కడ చికిత్స పొందుతున్నారన్న వివరాలు కూడా వెల్లడించేందుకు నిరాకరించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిసిన మీడియా ప్రతినిధులు ఆరా తీయగా, ఒకరికే జ్వరం వచ్చిందని టాబ్లెట్ ఇచ్చి పంపించామని అధికారుల సమాధానం ఆశ్చర్యానికి గురి చేసింది.

సమీక్షలో అధికారులు – తల్లిదండ్రుల ఆగ్రహం

ఈ ఘటనపై ఆర్డీవో వేణు మాదవ్, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి శంకర్ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. అయితే, సమాచారం అందుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకొని అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

“పిల్లలకు సరైన భోజనం కూడా ఇవ్వడం లేదు. గతంలోనూ మధ్యాహ్న భోజనం విషయంలో పలు స్కూళ్లు, వసతి గృహాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయి. అయినా అధికారులు గుణపాఠం నేర్చుకోవడం లేదు” అని తల్లిదండ్రులు మండిపడ్డారు.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని తల్లిదండ్రులు డిమాండ్చేస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *