Suryapet: వరుస వివాహాలు చేసుకుంటూ, చివరకు మైనర్ బాలికను పెళ్లాడిన కానిస్టేబుల్‌పై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. విచారణ అనంతరం సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా, అతనిపై పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదు అయింది.
దుశ్చర్యకు పాల్పడిన కానిస్టేబుల్ కృష్ణంరాజు చివ్వెంల మండలానికి చెందినవాడు. 2012లో పోలీసు విభాగంలో చేరిన అతను తొలుత సూర్యాపేట జిల్లాకు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. కానీ కేవలం రెండు నెలల్లోనే విభేదాలు తలెత్తడంతో విడాకులు అయ్యాయి.
తరువాత మహబూబాబాద్‌కు చెందిన మరో యువతిని రెండోసారి వివాహం చేసుకున్నాడు. ఆ సంబంధం కూడా ఆరు నెలలకే ముగిసింది. ఇంతటితో ఆగకుండా, ఆరు నెలల క్రితం సూర్యాపేట జిల్లాకు చెందిన 16 ఏళ్ల మైనర్ బాలికను మూడో పెళ్లి చేసుకున్నాడు. కొద్ది కాలంలోనే ఆమెను కూడా వదిలేసి, మరో పెళ్లికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.
ఈ వ్యవహారం సోషల్ మీడియాలో బయటపడటంతో ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. వెంటనే విచారణకు ఆదేశించిన అధికారులు, ఆరోపణలు నిజమని నిర్ధారించడంతో కృష్ణంరాజును సస్పెండ్ చేశారు. సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు కూడా నమోదు అయింది.