Surya Teja: నెల్లూరు నగరవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఇబ్బంది పడకుండా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 13 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి, బాధిత ప్రజలకు అన్ని సదుపాయాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని నగరపాల సంస్థ కమిషనర్ సూర్య తేజ తెలియజేశారు. నెల్లూరు నగర పాలక సంస్థ అన్ని విభాగాల అధికారులతో మంగళవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి ఆయన మాట్లాడారు. రెవెన్యూ విభాగం ఆధ్వర్యంలో పునరావాస కేంద్రాలలో ప్రజలకు తాగునీరు, విద్యుత్ సౌకర్యం, ఫ్యాన్లు, పారిశుధ్యం తదితర సదుపాయాలను కల్పించి అవసరమైన అన్ని చర్యలను ప్రణాళిక బద్దంగా చేపట్టాలని సూచించారు.
ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జెసిబి సహాయంతో నగర వ్యాప్తంగా జరుగుతున్న డ్రైను కాలువల పూడికతీత, ప్రధాన కాలువల ద్వారా వర్షపు నీటి పారుదలకు చేపట్టిన పూడికతీత పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. నగరవ్యాప్తంగా ఉన్న పెద్ద హోర్డింగులను టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు గుర్తించి ప్రమాదకరమైన స్థితిలో ఉన్న వాటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని, ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు. ప్రచారం కోసం వినియోగిస్తున్న ఫ్లెక్సీలు, పోస్టర్లు ఇతర హోర్డింగులు గుర్తించి వెంటనే తొలగించాలని కమిషనర్ ఆదేశించారు.
టౌన్ ప్లానింగ్ నిబంధనల మేరకు లేకుండా మురుగునీటి కాలువలపై నిర్మించిన రాంపులు, మెట్లు, ఇతర నిర్మాణాలను అవసరమైన చోట jcb బ్రేకర్స్ ద్వారా పగులకొట్టి వర్షపు నీరు పారుదలకు ఎటువంటి అడ్డంకులను లేకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. వెటర్నరీ వైద్యుని నేతృత్వంలో భారీ వర్షాలకు ఇబ్బంది పడుతున్న వీధి జంతువులను గుర్తించి వాటికి తగిన రక్షణ ఏర్పాటు చేయాలని, అవసరమైన వాటిని సురక్షిత ప్రాంతాలకు,పశుశాలలకు తరలించాలని కమిషనర్ సూచించారు. విద్యుత్ శాఖ అధికారులను సమన్వయం చేసుకుంటూ నగర వ్యాప్తంగా వర్షాలకు దెబ్బతిన్న చెట్లు,చెట్ల కొమ్మలను తొలగించాలని కమిషనర్ హెల్త్ ఆఫీసరు, సిబ్బందిని ఆదేశించారు.