supreme court: తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గత కొన్నాళ్లుగా దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఈ కేసు విచారణ కొనసాగుతున్నది. ఈ రోజు (ఏప్రిల్ 2) కేసు విచారణకు వచ్చింది. గతంలో జరిగిన విచారణలో బీఆర్ఎస్ తన వాదనలను వినిపించింది. ఈ రోజు ప్రతివాదులను కోర్టు విచారించింది. ఈ సమయంలోనే ప్రతివాదులపై, సీఎం రేవంత్‌రెడ్డిపైనా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత ఈ కేసు విచారణను రేపటికి (ఏప్రిల్ 3) వాయిదా వేసింది.
supreme court: బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కొన్నాళ్ల క్రితం వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ విషయమై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకటి, ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానందగౌడ్‌లు మరొక పిటిషన్‌ను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. వీటిపై గత కొన్నాళ్లుగా సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నది. నాలుగు వారాల్లోగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని బీఆర్ఎస్ న్యాయస్థానాన్ని కోరింది. అయితే ఈ రోజు స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి సహా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల తరఫు వాదనలు జరిగాయి.
supreme court: ఈ రోజు విచారణ సమయంలో ప్రతివాదులతో సుప్రీం న్యాయమూర్తుల ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సమయంలో వాడీవేడిగా విచారణ కొనసాగింది. స్పీకర్ తరఫు న్యాయవాదిపై ప్రశ్నల వర్షం కురిపించింది. గతంలో కోర్టు ధిక్కరణ కేసులో స్పీకర్‌ను విచారణకు పిలిచిన విషయాన్ని మర్చిపోవద్దని జస్టిస్ బీఆర్ గవాయ్ హెచ్చరించారు. స్పీకర్ ఇంకో నాలుగేళ్లు ఏ నిర్ణయం తీసుకోకుండా ఉంటే న్యాయస్థానాలు అలానే చేతులు కట్టుకొని కూర్చోవాలా? అంటూ ప్రశ్నించారు.
supreme court: ఇదిలా ఉండగా, విచారణ సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి అంశం చర్చకు వచ్చింది. అసెంబ్లీలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత పడదని, ఉప ఎన్నికలు రావని సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన అంశాన్ని బీఆర్ఎస్ తరఫు న్యాయవాది సుందరం సుప్రీంకోర్టు జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమయంలో కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. కోర్టులో నడుస్తున్న కేసును రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ఎలా మాట్లాడుతారని, ఉప ఎన్నికలు రావని రేవంత్‌రెడ్డి ఎలా అంటారు? అని ప్రశ్నించింది. ఇంతకు ముందే ఇలా న్యాయస్థానానికి వ్యతిరేకంగా రేవంత్‌రెడ్డి మాట్లాడారని, మళ్లీ అలానే రిపీట్ చేస్తున్నారని అంటూ రేవంత్‌రెడ్డిపై జస్టిస్ బీఆర్ గవాయ్ మండిపడ్డారు.