Supreme Court: దివ్యాంగులను అపహాస్యం చేస్తూ జోకులు వేసిన కమెడియన్లపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, స్టాండప్ కమెడియన్లు సమయ్ రైనా, విపుల్ గోయల్, బాల్రాజ్ పరమ్‌జీత్ సింగ్ ఘాయ్, సోనాలి ఠక్కర్, నిశాంత్ తన్వర్‌తో పాటు మరో ఐదుగురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది స్వేచ్ఛ కాదు, వాణిజ్య ప్రసంగం: కోర్టు, “స్టాండప్ కామెడీ పేరుతో దివ్యాంగులను లక్ష్యంగా చేసుకోవడం స్వేచ్ఛ కాదు. ఇది కేవలం వాణిజ్య ప్రసంగం మాత్రమే. ఒక కమ్యూనిటీ లేదా వర్గం యొక్క మనోభావాలను దెబ్బతీయడం ద్వారా డబ్బు సంపాదించడం తప్పు” అని స్పష్టం చేసింది. ఈ ఐదుగురు కమెడియన్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు తమ యూట్యూబ్ ఛానెళ్లు, ఇతర సోషల్ మీడియా ఖాతాలలో తక్షణం క్షమాపణలు చెప్పాలని కోర్టు ఆదేశించింది.
Also Read: Kanpur: డాక్టర్ ఐఫోన్ కొట్టేశాడు.. గంటలో దొరికిపోయాడు!
భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా నిరోధించడానికి దివ్యాంగులు, మహిళలు, పిల్లలు వృద్ధులపై అపహాస్యకరమైన కంటెంట్‌ను నియంత్రించడానికి మార్గదర్శకాలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి కోర్టు ఆదేశించింది. క్షమాపణలు చెప్పకపోతే కమెడియన్లపై జరిమానా విధించే విషయాన్ని కోర్టు తర్వాత పరిశీలిస్తుందని తెలిపింది. దివ్యాంగుల హక్కుల కోసం పనిచేసే ‘క్యూర్ ఎస్‌ఎంఏ ఫౌండేషన్’ అనే సంస్థ కమెడియన్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు దివ్యాంగులపై, ముఖ్యంగా స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA) అనే అరుదైన వ్యాధిగ్రస్తులపై వేసే జోకులను నిషేధించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. గతంలో కూడా ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు “హాస్యం అనేది జీవితంలో ఒక భాగం. కానీ ఇతరుల బలహీనతలపై నవ్వడం హానికరం,” అని వ్యాఖ్యానించింది. ఈ తీర్పుతో, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, కమెడియన్లు తమ కంటెంట్ పట్ల మరింత బాధ్యతాయుతంగా ఉండాలని సుప్రీంకోర్టు ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చిందని చెప్పాలి.