Kangana Ranaut: రైతుల ఆందోళనలపై చేసిన ట్వీట్ వివాదంపై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. తనపై నమోదైన పరువు నష్టం కేసును కొట్టివేయాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
2020-21లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా, 73 ఏళ్ల వృద్ధురాలు మహీందర్ కౌర్‌పై కంగనా రనౌత్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా షాహీన్‌బాగ్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించిన బిల్కిస్ బానో, రైతు ఉద్యమంలో పాల్గొంటున్న మహీందర్ కౌర్ ఇద్దరూ ఒకటేనంటూ ఆమె ఒక పోస్ట్‌ను రీట్వీట్ చేశారు. ఈ పోస్టు ద్వారా మహీందర్ కౌర్ పరువుకు భంగం కలిగించారని ఆరోపిస్తూ ఆమెపై ఫిర్యాదు నమోదైంది.
సుప్రీంకోర్టు వ్యాఖ్యలు :
ఈ పిటిషన్‌ను జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారించింది. “ఇది కేవలం ఒక రీట్వీట్ కాదు, దీనికి మసాలా జోడించారు” అంటూ ధర్మాసనం కంగనాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కంగనా రనౌత్ చేసిన ట్వీట్ “అగ్నికి ఆజ్యం పోసింది” అని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసును కొట్టివేయడానికి ఇటీవల హైకోర్టు నిరాకరించిన తర్వాత కంగనా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో కంగనాపై ఉన్న ఈ కేసు విచారణ కొనసాగనుంది.
రాజకీయాల్లోకి ప్రవేశించి ఎంపీగా ఎన్నికైన కంగనా రనౌత్‌కు ఈ కేసు ఒక సవాలుగా మారే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

