Supreme Court

Supreme Court: పల్నాడు జంట హత్యల కేసు: పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

Supreme Court: పల్నాడు జిల్లాలో జరిగిన జంట హత్యల కేసు విషయంలో వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిలకు సుప్రీంకోర్టులో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. పిన్నెల్లి సోదరులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌లను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేయడమే కాకుండా, గతంలో మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులను కూడా తక్షణమే రద్దు చేసింది.

సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ సందీప్ మెహతా మాట్లాడుతూ, ఇద్దరిని హత్య చేసిన కేసులో నిందితులకు ముందస్తు బెయిల్‌కు అర్హత లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదిస్తూ, పిన్నెల్లి సోదరులు విచారణకు సహకరించలేదని, అంతేకాకుండా సాక్షులను బెదిరించారని, సాక్ష్యాలను ట్యాంపరింగ్ చేసే ప్రయత్నాలు చేశారని కోర్టుకు వివరించారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం, పిన్నెల్లి సోదరులను వెంటనే అరెస్టు చేయడానికి ఎలాంటి అనుమతులు అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది.

Also Read: Kadapa: భార్య బతికి ఉండగానే ‘చనిపోయినట్లు’ ఫేక్ సర్టిఫికెట్ పంపిన భర్త.. కడపలో వింత కేసు!

కేసు దర్యాప్తు విషయంలో ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరుపై కూడా సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సెక్షన్ 161 కింద నమోదు చేసిన డాక్యుమెంట్లు (సాక్షుల వాంగ్మూలాలు) నిందితులకు ఎలా అందాయని ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పోలీసులు నిందితులకు సహకరిస్తున్నట్లు ఉందని, ఈ వ్యవహారంపై కూడా దర్యాప్తు అవసరమని జస్టిస్ సందీప్ మెహతా వ్యాఖ్యానించారు. ఛార్జిషీట్‌తో పాటు కోర్టుకు సమర్పించాల్సిన డాక్యుమెంట్లు నిందితులకు అందడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

లొంగిపోవడానికి గడువు
పిన్నెల్లి సోదరుల తరఫు న్యాయవాదులు తమ క్లయింట్లు లొంగిపోవడానికి రెండు వారాల సమయం ఇవ్వాలని కోర్టును విజ్ఞప్తి చేశారు. దీనిపై మొదట జస్టిస్ సందీప్ మెహతా, ముందస్తు బెయిల్ కేసులో లొంగిపోవడానికి సమయం ఎలా ఇస్తారని ప్రశ్నించినా, చివరకు రెండు వారాల గడువు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ గడువులోగా నిందితులు తప్పనిసరిగా కోర్టు ఎదుట లొంగిపోవాలి.

ఈ ఏడాది మే 24న పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నాయకులు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరావు దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ కేసులోనే పిన్నెల్లి సోదరులు నిందితులుగా ఉన్నారు. గతంలో హైకోర్టు ముందస్తు బెయిల్‌ను తిరస్కరించడంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం కూడా వారి పిటిషన్‌ను కొట్టివేయడం వారికి పెద్ద ఎదురుదెబ్బ.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *