Mohan Babu: తెలుగు సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు, శ్రీ విద్యానికేతన్ సంస్థల వ్యవస్థాపకుడు డా. మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆరోపణలతో నడుస్తున్న కేసులో విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు త్రుటిలో తిరస్కరించింది. తద్వారా మే 2న విచారణ అధికారి ఎదుట మోహన్‌బాబు తప్పనిసరిగా హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం ధర్నా – కోడ్ ఉల్లంఘనగా కేసు
2019లో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన విద్యాసంస్థలకు బకాయిలుగా ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల్లో జాప్యం చేస్తోందని ఆరోపిస్తూ, మోహన్‌బాబు తన కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్‌తో కలిసి తిరుపతి – మదనపల్లె జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముందస్తు అనుమతి లేకుండా రోడ్డుపై ధర్నాకు దిగినందుకు, వాహనదారులకు అసౌకర్యం కలిగించినందుకు, ముఖ్యంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి.
న్యాయ వాదనలు – ప్రైవేట్ వ్యక్తి కాబట్టి ఎంసీసీ వర్తించదా?
సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా మోహన్‌బాబు తరపు న్యాయవాది, ఆయన వయస్సు 75 ఏళ్లు, విద్యాసంస్థ నడుపుతున్న ప్రైవేట్ వ్యక్తి కాబట్టి ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తించదని వాదించారు. బకాయిల కోసం చేపట్టిన ఆందోళన ఎంసీసీ పరిధిలోకి రావడం లేదని పేర్కొన్నారు. అయితే, ఈ వాదనలను ధర్మాసనం పరిశీలించిన తర్వాత స్టే ఇవ్వలేమని తేల్చిచెప్పింది.
రాష్ట్రానికి నోటీసులు జారీపై కూడా నిరాకరణ
ఈ దశలో రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయాలని మోహన్‌బాబు తరపున కోర్టును కోరినప్పటికీ, ధర్మాసనం అందుకు కూడా అంగీకరించలేదు. ధర్నా సమయంలో మోహన్‌బాబు ప్రత్యక్షంగా అక్కడే ఉన్నారా? అనే ప్రశ్నను కూడా ధర్మాసనం లేవనెత్తింది. అన్ని అంశాలపై రెండు పక్షాల వాదనలు విన్న అనంతరం, తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ, మే 2న విచారణకు హాజరుకావాలని మోహన్‌బాబుకు స్పష్టం చేసింది.