Supreme Court: ఇకపై ఇష్టానుసారం మీడియా ముందుకు రావొద్దు.. పోలీసులకు సుప్రీంకోర్టు చెక్!

Supreme Court: పోలీసు అధికారులు మీడియాకు కేసుల వివరాలు వెల్లడించే విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నేర దర్యాప్తులో గోప్యతను కాపాడుతూనే, ప్రజలకు అవసరమైన సమాచారాన్ని ఎలా అందించాలో వివరిస్తూ ఒక ప్రత్యేకమైన “మీడియా బ్రీఫింగ్ విధానాన్ని” రూపొందించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. దీనికోసం రాష్ట్రాలకు మూడు నెలల గడువు ఇచ్చింది.

కేసులకు సంబంధించి పోలీసులు ఇచ్చే సమాచారం వల్ల విచారణకు ఆటంకం కలగకూడదని, అలాగే నిందితులు లేదా బాధితుల హక్కులకు భంగం వాటిల్లకూడదని కోర్టు స్పష్టం చేసింది. సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ అందించిన మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకొని ఈ కొత్త నిబంధనలను రూపొందించాలని ధర్మాసనం పేర్కొంది.

ముఖ్యమైన నిబంధనలు ఇవే:

  • సమాచార పరిమితి: పోలీసులు ఇచ్చే సమాచారం కేవలం వాస్తవాలకు లోబడి ఉండాలి. సాక్షుల వివరాలను లేదా కేసులో ఇంకా తేలని అంశాలను ముందుగానే వెల్లడించకూడదు. ఎఫ్.ఐ.ఆర్ నమోదు, అరెస్టు వంటి కీలక దశల గురించి మాత్రమే తటస్థ భాషలో చెప్పాలి.

  • వ్యక్తిగత వివరాల రక్షణ: బాధితుల గుర్తింపును వెల్లడించకూడదు. అలాగే కులం, మతం, లింగం వంటి అంశాలను ప్రస్తావించకూడదు. కేవలం అత్యవసర పరిస్థితుల్లో, ప్రజల భద్రత కోసం అవసరమైతే తప్ప ఇలాంటి వివరాలు చెప్పకూడదు.

ఇది కూడా చదవండి: Sunita Williams: స్పేస్​లో 608 రోజులు.. సునీతా విలియమ్స్ రిటైర్మెంట్

  • అధికారిక ప్రతినిధులు మాత్రమే: ప్రతి జిల్లాలో లేదా కమిషనరేట్‌లో నిర్ణయించిన అధికారులు మాత్రమే మీడియాతో మాట్లాడాలి. అనుమతి లేకుండా ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదా సమాచారాన్ని లీక్ చేయడం క్రమశిక్షణా రాహిత్యంగా పరిగణించబడుతుంది.

  • సోషల్ మీడియా వినియోగం: సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ వ్యాఖ్యలు చేయడం లేదా కేసుల గురించి సొంత అభిప్రాయాలు చెప్పడం నిషిద్ధం. తప్పుడు సమాచారం వ్యాపిస్తే వెంటనే పారదర్శకంగా సరిదిద్దాలి.

ముఖ్యంగా ఆత్మహత్యలు, కస్టడీ మరణాలు లేదా సున్నితమైన మతపరమైన అంశాల విషయంలో పోలీసులు చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని, ఉద్రిక్తతలు తగ్గించే విధంగానే వారి మాటలు ఉండాలని కోర్టు సూచించింది. ఈ కొత్త నిబంధనల వల్ల పోలీసుల పనితీరులో పారదర్శకత పెరగడమే కాకుండా, అనవసరమైన “మీడియా ట్రయల్స్”కు అడ్డుకట్ట పడుతుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *