Supreme Court: పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి తనపై అత్యాచారం చేశాడని ఆరోపణలతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన వివాహితకు కోర్టు కఠినమైన వ్యాఖ్యలు చేసింది. నిందితుడి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ఆమె చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అంతేకాకుండా, వివాహితకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది.
కోర్టు కఠిన వ్యాఖ్యలు
న్యాయమూర్తులు ఎం.ఎం. సుందరేష్, ఎన్.కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం మాట్లాడుతూ..“మీరు ఇద్దరు పిల్లలు ఉన్న వివాహిత. మీరు పరిణతి చెందిన మహిళ. వివాహ బంధంలో ఉండి కూడా వేరే వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరమే. ఇది మీకే తెలిసి చేసారు” అని వ్యాఖ్యానించారు.
ఆమె న్యాయవాది చేసిన వాదనకు కోర్టు ప్రశ్నించింది:
ఆ వ్యక్తి మిమ్మల్ని హోటళ్లకు పిలిచాడని చెబుతున్నారు. కానీ మీరు ఎందుకు పదే పదే హోటళ్లకు వెళ్లారు? వివాహం వెలుపల సంబంధం పెట్టుకోవడం నేరమని మీకే తెలుసు అని గట్టిగా ప్రశ్నించింది.
ఇది కుడా చదవండి: Revanth Reddy: ఢిల్లీకి కాకుండా ఫామ్‌హౌస్‌కు వెళ్లాలా?
కేసు నేపథ్యం
2016లో సోషల్ మీడియాలో వివాహిత మహిళ, అంకిత్ బర్న్వాల్ పరిచయం అయ్యారు. బర్న్వాల్ ఒత్తిడి కారణంగా ఆమె భర్తకు విడాకులు కోరింది. మార్చి 6న కోర్టు విడాకులు మంజూరు చేసింది. విడాకుల తర్వాత రెండు వారాల్లోనే ఆమె బర్న్వాల్‌ను పెళ్లి చేసుకోమని అడిగింది. అయితే బర్న్వాల్ నిరాకరించడంతో ఆమె బీహార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
హైకోర్టు & సుప్రీంకోర్టు తీర్పులు
భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత బర్న్వాల్‌తో ఎలాంటి లైంగిక సంబంధం జరగలేదని రికార్డుల ఆధారంగా పాట్నా హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ వివాహిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అయితే సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ..“ముందస్తు బెయిల్ మంజూరు చేయడంలో ఎలాంటి తప్పు లేదు” అని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు హెచ్చరిక
వివాహిత మహిళకు సుప్రీంకోర్టు గట్టిగా హెచ్చరించింది: భర్త కాకుండా వేరే వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకోవడం మీకే నేరం అవుతుంది. అలాంటి సందర్భాల్లో మీపై కూడా కేసు నమోదు చేయవచ్చు అని తేల్చి చెప్పింది.

