Viveka Murder Case

Viveka Murder Case: ముగింపు దిశగా వివేకా కేసు?.. నెల రోజుల్లోపు తేల్చాల్సిందేనన్న సుప్రీంకోర్టు.

Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ట్రయల్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లపై నాలుగు వారాల్లోగా విచారణ పూర్తి చేసి, తగిన నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. దిల్లీలో జరిగిన విచారణ సందర్భంగా జస్టిస్ ఎంఎం సుందరేశ్ ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.

ఈ కేసు దర్యాప్తుపై సీబీఐ కోర్టుకు కీలక వివరాలు వెల్లడించింది. ఇప్పటికే మూడో సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను దాఖలు చేశామని, తమ వైపు నుంచి దర్యాప్తు ప్రక్రియ పూర్తయిందని సీబీఐ న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. అయితే, వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాది దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము లేవనెత్తిన కొన్ని కీలక అంశాలపై ఇంకా పూర్తిస్థాయిలో దర్యాప్తు జరగలేదని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

రెండు వైపుల వాదనలు విన్న సుప్రీంకోర్టు, ఈ అంశంపై ట్రయల్ కోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. సెక్షన్ 207 కింద దాఖలైన అన్ని పిటిషన్లను పరిశీలించి, నాలుగు వారాల్లో తుది తీర్పు వెలువరించాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. దీంతో ఈ కేసు విచారణ ఇప్పుడు వేగవంతం కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *