CM Chandrababu: స్వచ్ఛమైన ఆలోచనలతోనే స్వర్ణాంధ్ర సాధ్యమని, పరిశుభ్రతే దానికి తొలిమెట్టు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో జరిగిన “స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర” కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, అభివృద్ధి, సంక్షేమం, ప్రజారోగ్యంపై తన ప్రభుత్వ దార్శనికతను వివరిస్తూ, గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
అక్టోబర్ 2 నాటికి చెత్త రహిత రాష్ట్రం :
ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ఒక బాధ్యతగా స్వీకరించాలని సీఎం పిలుపునిచ్చారు. చెత్త, అపరిశుభ్రత వల్లే అంటువ్యాధులు ప్రబలుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం “చెత్తపై పన్ను” వేసి వసూలు చేసింది తప్ప, చెత్తను తొలగించలేదని ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వం అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా మారుస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. వ్యర్థాల నుంచి సంపద సృష్టించే (“Waste to Wealth”) విధానాలపై దృష్టి సారించామని, ఈ-వేస్ట్‌ను రీసైక్లింగ్ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, దానిలో భాగంగా పెద్దాపురంలో 100 పడకల ఆసుపత్రిని నిర్మిస్తామని వాగ్దానం చేశారు.
Also Read: Jounior vs MLA: అనంతపురంకు ఎన్టీఆర్..? సెప్టెంబర్ 2 ముహూర్తం..?
“సూపర్ సిక్స్ సూపర్ హిట్”
సంక్షేమం, అభివృద్ధిని తమ ప్రభుత్వం రెండు కళ్ళుగా భావిస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. ఎన్నికలకు ముందు తాము ప్రకటించిన “సూపర్ సిక్స్” పథకాలు అసాధ్యమని కొందరు ఎగతాళి చేశారని, కానీ వాటన్నింటినీ అమలు చేసి చూపిస్తున్నామని, అవి ఇప్పుడు “సూపర్ హిట్” అయ్యాయని హర్షం వ్యక్తం చేశారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వారిని ఎంతో ఆనందానికి గురిచేస్తోంది.
ప్రతి కుటుంబానికి ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నాం.
రాష్ట్రంలోని 40,000 హెయిర్ కటింగ్ సెలూన్లకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాం.
అన్నదాత-సుఖీభవ కింద రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాం.
అప్పులు చేసి సంక్షేమం చేయడం కాదని, సంపద సృష్టించి ఆ ఆదాయాన్ని ప్రజలకు పంచడమే తమ విధానమని చంద్రబాబు స్పష్టం చేశారు.
వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు :
చంద్రబాబు నాయుడు గత ఐదేళ్ల వైసీపీ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన మాటల్లో, వైసీపీ ప్రభుత్వం అరాచక పాలనను నడిపి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిందని, అభివృద్ధికి అడ్డంకులు సృష్టించి అమరావతిపై దుష్ప్రచారం చేస్తూ పెట్టుబడిదారులను తరిమికొట్టిందని ధ్వజమెత్తారు. నేర చరిత్ర కలిగిన వారిని రాజకీయాల్లోకి తీసుకువచ్చి విష రాజకీయాలను ప్రోత్సహించారని ఆరోపించారు. ముఖ్యంగా, సోషల్ మీడియాలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసే వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. తమ రాజకీయాలు విజన్‌తో కూడినవైతే, వైసీపీ రాజకీయాలు క్రిమినల్ ధోరణిలో ఉన్నాయని పోల్చారు. ప్రజల సహకారంతో రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలో నడిపించి, అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు స్పష్టం చేశారు.