Congress: కాంగ్రెస్ పార్టీ వైఖరిపై తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు భగ్గుమన్నారు. తనకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలతో కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగింది. గత కొన్నాళ్లుగా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్న సునీతారావు.. ఒక్కసారిగా పార్టీ వైఖరిపై మండిపడ్డారు. తనకు జరుగుతున్న అన్యాయాన్ని ఏకరువు పెట్టారు.
Congress: ముదిరాజ్ బిడ్డనైన తనకు కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందని సునీతారావు ఆవేదన వ్యక్తం చేశారు. తనను మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తొలగించేందుకే పార్టీ నిర్ణయించిందని అనుమానం వ్యక్తం చేశారు. పార్టీ కోసం తాను కూలి మనిషిగా పనిచేశానని, అందుకే తనకు తగిన శాస్తి జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి పదవి ఇవ్వకపోగా, ఉన్న పదవిని ఎలా తీసేస్తారని ప్రశ్నించింది.
Congress: తాను అసెంబ్లీ ఎన్నికల సమయంలో వద్దని ఎంతగా వేడుకున్నా.. గోషామహల్ సీటు ఇచ్చారని, తాను ఓడిపోయినందుకే తనను పదవి నుంచి తొలగిస్తారా? అని సునీతారావు పార్టీ అధిష్ఠానాన్ని ప్రశ్నించారు. అలా అయితే అదే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన సరితా తిరుపతయ్యకు తన పదవిని ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో ఓడిన గద్దర్ బిడ్డ వెన్నెలకు కార్పొరేషన్ పదవిని ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.
Congress: గతంలో హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓడిన వెంకట్ బల్మూరికి ఎన్ఎస్‌యూఐ అధ్యక్ష పదవి, మరో రెండు పోస్టులు ఎలా ఇచ్చారని సునీతారావు మరో ప్రశ్నను సంధించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపైనా ఆమె తన ఆవేదనను వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి గెలుపు కోసం తాను లేబర్‌లెక్క పనిచేశానని, అంత చేసినా తనను తొలగించడం అన్యాయం కాదా? అని సునీతారావు ప్రశ్నించారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో మళ్లీ కలకలం రేగింది.
Congress: ఆమె గత కొన్నాళ్లుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నా.. తాజా వ్యాఖ్యలతో ఆ పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి పదవిని సరితా తిరుపతయ్యకు ఇస్తారేమోనని ప్రచారం జరుగుతుంది. సరితా తిరుపతయ్య నియామకంపై అధిష్ఠానం ఇప్పటికే నిర్ణయించిందని, ప్రకటించడమే తరువాయి అని, ఈ దశలో సునీతారావు అసంతృప్తిపై పార్టీలో రకరకాల చర్చ జరుగుతున్నది. సునీతారావుకు మరో ఉన్నత పదవి లభిస్తుందని ఒక వర్గం అంటుండగా, ఆమెను దూరం చేసుకుంటుందని మరో వర్గం అంటున్నారు.

