MAZAKA Teaser Released: సందీప్ కిషన్ నటిస్తున్న 30వ చిత్రం ‘మజాకా’. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రాజేష్ దండా, ఉమేష్ కెఆర్ బన్సాల్ దీనిని నిర్మించారు. సంక్రాంతి బరిలో దిగాల్సిన ఈ సినిమా ఇప్పుడు ఫిబ్రవరి 21న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఆదివారం మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. తండ్రీకొడుకులకు సంబంధించిన పేరలల్ లవ్ స్టోరీ ఇదని టీజర్ చూస్తే అర్థమౌతోంది. ఈ టీజర్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు త్రినాథరావు నక్కిన చేసిన ప్రసంగం వివాదాస్పదం అయ్యింది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న ‘మన్మథుడు’ ఫేమ్ అన్షు ను ఆయన బాడీ షేమింగ్ చేశారు. ఆమె ఈ మధ్యకాలంలో బాగా సన్నబడిందని, ఇలా ఉంటే తెలుగువారికి నచ్చదు, బాగా తిని అన్నీ కాస్తంత పెంచమన్నానని అన్నారు. అలానే హీరోయిన్ పేరు మర్చిపోయినట్టుగా స్టేజ్ మీద నటించి, పక్క వారిని మంచినీళ్ళు అడిగి ఆ తర్వాత పేరు చెప్పారు. ఇటీవల పుష్ప-2 సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ సీఎం పేరును మర్చిన పోయిన విధంగా దర్శకుడు త్రినాధ రావు నక్కిన ప్రవర్తించిన తీరు నెటిజన్స్ కు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు ఆగ్రహాన్ని తెప్పించింది. సినిమా పబ్లిసిటీ కోసం మరీ ఇంతలా చేయాలా అంటున్నారు సినీ జనం.

