Suicide Attempt: భద్రాచలంలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమై, కలకలం రేపుతోంది. దళిత సంఘాల నాయకులు తనను వేధిస్తున్నారని, వారి ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేస్తున్నానని ఆరోపిస్తూ మహిళా నాయకురాలు మేకల లత సోషల్ మీడియాలో విడుదల చేసిన సెల్ఫీ వీడియో సంచలనం సృష్టిస్తోంది. స్థానిక పంచాయతీకి సంబంధించిన ఒక వివాదంలో తాను జోక్యం చేసుకున్నందుకే, దళిత సంఘాల నాయకులు తనపై వేధింపులకు పాల్పడుతున్నారని లత ఆ వీడియోలో ఆరోపించారు.
సెల్ఫీ వీడియోలో లత ఆవేదన
ఆత్మహత్యాయత్నం చేయడానికి ముందు మేకల లత రికార్డు చేసిన సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను వెళ్లగక్కారు. ముఖ్యంగా ఆమె చేసిన ఆరోపణలు ఇలా ఉన్నాయి.. ఒక పంచాయతీ విషయంలో, ఒక మహిళకు జరిగిన అన్యాయాన్ని అడ్డుకున్నందుకు, ఆ మహిళకు అండగా నిలబడినందుకు దళిత సంఘాల నాయకులు నన్ను వేధిస్తున్నారు. వారి ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను.
ఇది కూడా చదవండి: Sangareddy: జీవితంలో ఓడిండు.. ఎన్నికల్లో గెలిచిండు!
తనపై అన్యాయంగా ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను చనిపోయేలా కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దు. వారికి కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాను. తన చావుకు స్థానిక ఎస్సీ సంఘాల నాయకులే కారణమంటూ ఆమె స్పష్టం చేశారు.
ఆసుపత్రికి తరలింపు, పోలీసుల విచారణ
సెల్ఫీ వీడియో రికార్డ్ చేసిన అనంతరం, మేకల లత నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, ఆమెను భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఇది కూడా చదవండి: H-1B Visa: భారత హెచ్1బీ, హెచ్4 వీసాలు రద్దు.. వెట్టింగ్ వేళ మరో పిడుగు
ఈ సంఘటనపై భద్రాచలం పట్టణ సీఐ నాగరాజు స్పందించారు. జరిగిన సంఘటనపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారని, మేకల లత ఆరోపణల వెనుక గల వాస్తవాలను, సంఘాల పాత్రను తెలుసుకుంటామని తెలిపారు.
ఒక మహిళా నాయకురాలు దళిత సంఘాల నాయకులపై నేరుగా వేధింపుల ఆరోపణలు చేస్తూ ఆత్మహత్యాయత్నం చేయడం భద్రాచలంలో ఉద్రిక్తతకు దారితీసింది. కేసు విచారణలో ఎలాంటి నిజాలు వెలుగులోకి వస్తాయనేది వేచి చూడాలి.
