Nara Lokesh: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరావతిలో విద్యార్థులతో కూడిన మాక్ అసెంబ్లీ ఎంతో సందడిగా జరిగింది. అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. విద్యార్థులకు అసెంబ్లీ సర్వసభా తీరు, నిర్ణయాల ప్రక్రియ, చర్చలు ఎలా జరుగుతాయో ప్రత్యక్ష అనుభవం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
విద్యార్థులు అసెంబ్లీ పాత్రలను ఎంతో ఉత్సాహంగా పోషించారు. మన్యం జిల్లాకు చెందిన ఎం. లీలా గౌతమ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించగా, ప్రతిపక్ష నేతగా అదే జిల్లాకు చెందిన సౌమ్య బాధ్యతలు చేపట్టింది. విశాఖ జిల్లాకు చెందిన కోడి యోగి ఉప ముఖ్యమంత్రిగా, తిరుపతి జిల్లాకు చెందిన చిన్మయి విద్యాశాఖ మంత్రిగా, కాకినాడ జిల్లాకు చెందిన స్వాతి స్పీకర్గా వ్యవహరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Also Read: Pawan Kalyan: కోనసీమ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన..
సామాజిక మాధ్యమాల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన బిల్లులపై విద్యార్థుల మధ్య జరిగిన స్వల్పకాలిక చర్చ అందరి దృష్టిని ఆకర్షించింది. దేశవ్యాప్తంగా ఉన్న 45 వేల పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా మరింత మంది విద్యార్థులకు కూడా అసెంబ్లీ అనుభవాన్ని చేరవేశారు.
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంత్రి నారా లోకేశ్ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యాంగం అందించిన హక్కులను కాపాడుకోవడంతో పాటు, దాని స్ఫూర్తి పాటించాలన్నారు. ఈ కార్యక్రమాన్ని విద్యాశాఖ వినూత్నంగా నిర్వహించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో స్టూడెంట్ అసెంబ్లీ నిర్వహించడం ఈ దినోత్సవానికి మరింత విలువ తెచ్చిందని పేర్కొన్నారు.

