Earthquake

Earthquake: తైవాన్‌ను కుదిపేసిన భారీ భూకంపం.. 7.0 తీవ్రతతో ప్రకంపనలు

Earthquake: తైవాన్ ద్వీపాన్ని భారీ భూకంపం వణికించింది. శనివారం రాత్రి ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈశాన్య తీర ప్రాంతంలోని యిలాన్ నగరానికి సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.0గా నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. భూమికి సుమారు 73 కిలోమీటర్ల లోతున ఈ కదలికలు సంభవించాయి.

రాజధాని తైపీ నగరంలో భూకంప ధాటికి పలు భవనాలు నేలమట్టమయ్యాయి. రాత్రి 11:05 గంటల సమయంలో ఒక్కసారిగా ఇళ్లు, కార్యాలయాలు ఊగిపోవడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వీధుల్లోకి పరుగులు తీశారు. ఇంట్లోని సామాన్లు కిందపడి పగిలిపోతున్న దృశ్యాలు, భవనాలు దెబ్బతిన్న తీరుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. జాతీయ అగ్నిమాపక సంస్థ రంగంలోకి దిగి ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలను సేకరిస్తోంది.

ప్రస్తుతానికి సముద్ర తీర ప్రాంతాలకు సునామీ ముప్పు లేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే, గడిచిన కొద్ది రోజుల్లోనే తైవాన్‌లో భూమి కంపించడం ఇది రెండోసారి. కేవలం మూడు రోజుల క్రితమే 6.1 తీవ్రతతో భూకంపం సంభవించగా, ఇప్పుడు అంతకంటే బలమైన ప్రకంపనలు రావడం ద్వీపవాసులను కలవరపెడుతోంది. 2024 ఏప్రిల్‌లో సంభవించిన భారీ భూకంపం తర్వాత, మళ్ళీ ఆ స్థాయిలో ముప్పు పొంచి ఉండటంతో ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *