Wine Shops: మునుగోడు నియోజకవర్గంలో మద్యం విక్రయాల విషయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మద్యం షాపుల సమయపాలనపై విధిస్తున్న ఆంక్షల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఆదివారం మునుగోడులోని తన కార్యాలయంలో మద్యం వ్యాపారులతో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన, నియోజకవర్గంలో ఆరోగ్యకరమైన వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
కొత్త సమయపాలన నిబంధనలు ఇవే
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా, ఉదయాన్నే మద్యం సేవించే అలవాటును అరికట్టాలని ఎమ్మెల్యే కఠినమైన నిబంధనలను గుర్తుచేశారు. దీని ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట (1:00 PM) దాటిన తర్వాతే వైన్ షాపులు తెరవాలి. అలాగే సాయంత్రం 6 గంటల తర్వాతే పర్మిట్ రూముల్లో మద్యం సేవించేందుకు అనుమతించాలని వ్యాపారులను ఆదేశించారు. కేవలం లాభాల కోసమే కాకుండా సామాజిక బాధ్యతతో వ్యాపారం చేయాలని, ఉదయాన్నే మద్యం విక్రయించి నిరుపేదల జీవితాలను చిన్నాభిన్నం చేయవద్దని ఆయన హితవు పలికారు.
ఇది కూడా చదవండి: Suryapet: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయినులు దుర్మరణం.. మరో ఇద్దరికి సీరియస్
మద్యం నియంత్రణ వెనుక ఉన్న లక్ష్యం
ముఖ్యంగా యువత ఈ వ్యసనానికి బానిస కాకుండా చూడటమే తన ప్రధాన లక్ష్యమని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రశాంతత ఉండేలా చూసేందుకు మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గంలో ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసుల సహకారంతో ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ తనిఖీలను మరింత ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు. నిబంధనలు పాటించని షాపుల లైసెన్సులను రద్దు చేసేలా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మహిళల హర్షం.. రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు
మునుగోడులో అమలు చేస్తున్న ఈ మద్యం నియంత్రణ పద్ధతులపై ఇతర నియోజకవర్గాల నుంచి కూడా విశేష స్పందన లభిస్తోంది. ఈ నిర్ణయం వల్ల నిరుపేద కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయని, గొడవలు లేని ప్రశాంతమైన వాతావరణం ఉంటుందని స్థానిక మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంపాదన కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యమన్న ఎమ్మెల్యే నిర్ణయం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
