CM Chandrababu

CM Chandrababu: రైతుల భూమిపై కన్నేస్తే సహించం: సీఎం చంద్రబాబు

CM Chandrababu: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించి రైతులకు భరోసా కల్పించారు. గత ప్రభుత్వ హయాంలో భూ రికార్డులపై ఉన్న ఫోటోలను తొలగించి, ఆ స్థానంలో గౌరవప్రదమైన రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన స్వయంగా పంపిణీ చేశారు. భూమి అనేది పూర్వీకుల నుంచి వచ్చే ఆస్తి అని, దానిపై రాజకీయ నాయకుల ఫోటోలు వేసుకోవడం అహంకారానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు అత్యాధునిక క్యూ ఆర్ కోడ్, బ్లాక్ చైన్ టెక్నాలజీని ఈ కొత్త పుస్తకాల్లో ప్రవేశపెట్టామని, దీనివల్ల భూమి వివరాలను యజమాని ఎప్పుడైనా తన మొబైల్‌లో చూసుకోవచ్చని ముఖ్యమంత్రి వెల్లడించారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని, ముఖ్యంగా భూముల విషయంలో అక్రమాలకు పాల్పడితే వారి తాట తీస్తామని చంద్రబాబు హెచ్చరించారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేశామని, ఇప్పుడు యజమానుల అనుమతి లేకుండా భూమి రికార్డుల్లో ఒక్క అక్షరం కూడా మార్చలేరని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా రికార్డులను ట్యాంపర్ చేయడానికి ప్రయత్నిస్తే వారిని పీడీ యాక్టు కింద అరెస్ట్ చేసి నేరుగా జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. లంచాల వ్యవస్థను పూర్తిగా రూపుమాపేందుకే ఈ నూతన విధానాన్ని అమలు చేస్తున్నామని, ఇకపై ప్రతి నెలా 9వ తేదీన తాను స్వయంగా భూ సమస్యల పరిష్కారం కోసం అందుబాటులో ఉంటానని ప్రకటించారు.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9,500 గ్రామాల్లో సమగ్ర సర్వే నిర్వహించి, దాదాపు 62 లక్షల మంది రైతులకు కొత్త పాస్ పుస్తకాలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం 100 రూపాయలకే మ్యూటేషన్ ప్రక్రియను పూర్తి చేసే సౌకర్యం కల్పించామని, దీనివల్ల సామాన్య రైతులకు పెద్ద ఉపశమనం లభిస్తుందని ముఖ్యమంత్రి వివరించారు. భూ వివాదాలు లేని ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించడమే తన ధ్యేయమని, ఈ ఏడాది చివరి నాటికి ప్రతి యజమానికి తన భూమిపై పూర్తి భద్రత, సర్వహక్కులు కల్పిస్తానని కలుగొట్ల సభ ద్వారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *