Stock Market: భారతీయ స్టాక్ మార్కెట్లు గురువారం నాడు భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమైనప్పటికీ, మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల కారణంగా నష్టాల్లో కొనసాగాయి. కానీ మధ్యాహ్నం తర్వాత మార్కెట్ల దిశ ఒక్కసారిగా మారిపోయింది. చివరి గంటలో ఇన్వెస్టర్లు పెద్దఎత్తున కొనుగోళ్లకు దిగడంతో మార్కెట్లు గ్రీన్ జోన్‌లో కొనసాగాయి.
ఈ లాభాలకి కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్రేడ్ డీల్ వ్యాఖ్యలే. ఆయన వ్యాఖ్యలతో అమెరికా–భారత్ మధ్య సంబంధాలు మెరుగవుతాయన్న అంచనాలు మార్కెట్‌లో పాజిటివ్ సెంటిమెంట్‌కి దారితీశాయి. ఈ సెంటిమెంట్‌తో రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్ వంటి దిగ్గజ షేర్లలో కొనుగోళ్లు ఊపందుకున్నాయి.
సెన్సెక్స్ ఒక్కరోజులోనే 1,200 పాయింట్లు ఎగిసి 82,530.74 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 395 పాయింట్ల లాభంతో 25,061 వద్ద స్థిరపడింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 82,718.14 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. రూపాయి మారకం విలువ ప్రస్తుతం డాలరుతో పోల్చితే రూ.85.52 వద్ద ఉంది.
ఇటు ఆటో, ఐటీ, మెటల్, ఫైనాన్షియల్ రంగాల్లో మంచి కొనుగోళ్ల మద్దతు కనిపించింది. టాటా మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, అదానీ పోర్ట్స్, మారుతీ సుజుకీ లాంటి కంపెనీల షేర్లు మంచి లాభాలనిచ్చాయి. నిఫ్టీలో హీరో మోటోకార్ప్, జెఎస్‌డబ్ల్యూస్టీల్, ట్రెంట్, టాటా మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రధాన గెయినర్స్‌గా నిలిచాయి.
Also Read: test match: చాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారీ ప్రైజ్ మనీ ప్రకటించిన ఐసీసీ
Stock Market: బ్రాడ్ మార్కెట్లలో కూడా హుషారు కనిపించింది. బీఎస్‌ఇ మిడ్‌క్యాప్ సూచీ 0.6 శాతం, స్మాల్‌క్యాప్ సూచీ 0.9 శాతం లాభపడినట్లు నమోదైంది. రియాల్టీ, ఆయిల్ & గ్యాస్, మీడియా, బ్యాంకింగ్ రంగాలు కూడా 1–2 శాతం చొప్పున పెరిగాయి.
ఇక అంతర్జాతీయ మార్కెట్ల విషయానికొస్తే, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $63 వద్ద ట్రేడవుతుండగా, బంగారం ఔన్సు ధర $3177 వద్ద ఉంది. ఇవి కూడా మార్కెట్‌కి కొంత స్థిరత్వాన్ని అందించాయి. మొత్తానికి, ఈరోజు మార్కెట్‌లో భారీ లాభాలు నమోదవడం ఇన్వెస్టర్లలో నూతన ఉత్సాహం నింపింది. రేపటి ట్రేడింగ్ సెషన్ కూడా ఇదే వేగంతో కొనసాగుతుందా అన్నది, దేశీ అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది.