Steve Smith: ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ 2028లో లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియా టీ20 జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమని అంగీకరించాడు. అయితే, ఒలింపిక్స్‌లో ఆడాలనే తన కలను మాత్రం వదులుకోనని స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియా టీ20 జట్టు ప్రస్తుతం చాలా పటిష్టంగా ఉందని, అద్భుతమైన ఫామ్‌లో ఉన్న యువ ఆటగాళ్లు జట్టులో ఉన్నారని స్మిత్ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్ కోసం జట్టులోకి తిరిగి రావడం చాలా కష్టమని, అయినప్పటికీ తన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తానని చెప్పాడు. ఈ సందర్భంగా స్మిత్ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు.
‘నేను పిల్లాడిగా ఉన్నప్పటి నుంచి చాలా ఒలింపిక్స్ చూశాను. ఆస్ట్రేలియన్ అథ్లెట్లు పోటీ పడుతుంటే వీక్షించడం నాకు బాగా నచ్చేది. క్రికెట్ కూడా ఒలింపిక్స్‌లో భాగం కానుందని తెలిసి.. నేను చాలా ఆనందించాను’ అని అతడు వివరించాడు. చిన్నతనం నుంచీ ఒలింపిక్స్ చూడటం తనకు చాలా ఇష్టమని, క్రికెట్ ఒలింపిక్స్‌లో భాగమని తెలిసిన తర్వాత, అందులో పాల్గొనాలని కలలు కంటున్నానని స్మిత్ తెలిపాడు. ఇది తన దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి మరొక గొప్ప అవకాశం అని పేర్కొన్నాడు. టెస్ట్ క్రికెట్‌ను ఎంతవరకు ఆడతానో చూడాలని, అయితే షార్ట్ ఫార్మాట్ క్రికెట్‌ను ఇంకా చాలా కాలం ఆడాలని అనుకుంటున్నానని చెప్పాడు. ఒలింపిక్స్ కోసం టీ20 క్రికెట్‌పై దృష్టి పెడుతున్నానని తెలిపాడు.
ఇది కూడా చదవండి: LIC: 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎల్.ఐ.సి. సేవా, సమాజాభివృద్ధి పట్ల నిబద్ధతను పునరుద్ఘాటించింది
కాగా స్మిత్ ఇప్పటికే వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ నాటికి అతనికి 39 ఏళ్లు వస్తాయి. ఈ వయస్సులో కూడా అతను టీ20 క్రికెట్‌లో రాణించగలనని భావిస్తున్నాడు. దీని కోసం అతను ప్రపంచవ్యాప్తంగా వివిధ లీగ్‌లలో, ముఖ్యంగా బిగ్ బాష్ లీగ్, మేజర్ లీగ్ క్రికెట్, ది హండ్రెడ్ వంటి టోర్నమెంట్లలో ఆడుతూ తన ఆటను మెరుగుపరచుకుంటున్నాడు.