Tennis Player Shot Dead: హర్యానాలోని గురుగ్రామ్‌లో జులై 10, 2025న రాష్ట్ర స్థాయి టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ (25) ఆమె తండ్రి దీపక్ యాదవ్ చేతిలో దారుణంగా హత్యకు గురయ్యారు.
గురుగ్రామ్‌లోని సుశాంత్ లోక్ ఫేజ్-2లో నివాసముంటున్న రాధికా యాదవ్‌ను ఆమె తండ్రి తన లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో కాల్చి చంపినట్లు తెలుస్తోంది. ఉదయం 10:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రాధిక ఇంట్లో వంట చేస్తుండగా, ఆమె తండ్రి దీపక్ యాదవ్ వెనుక నుంచి ఆమెపై పలు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఐదు బుల్లెట్లు కాల్చగా, వాటిలో మూడు బుల్లెట్లు రాధికకు తగిలాయి. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన ప్రాథమిక సమాచారం ప్రకారం, రాధికా యాదవ్ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడాన్ని ఆమె తండ్రి తీవ్రంగా వ్యతిరేకించాడు. ఈ విషయంలో తండ్రీకూతుళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. అలాగే, రాధిక తన స్వంత టెన్నిస్ అకాడమీని నడుపుతూ తన సంపాదనతోనే జీవిస్తుండటం, దీనిపై చుట్టుపక్కల వారి నుండి తాను “కూతురి సంపాదనపై బతుకుతున్నావా?” వంటి వ్యాఖ్యలు వినడం వల్ల దీపక్ యాదవ్ ఆగ్రహానికి లోనైనట్లు పోలీసులకు తెలిపాడు. ఈ కారణాలతోనే అతను ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం.
పోలీసులు నిందితుడు దీపక్ యాదవ్‌ను అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన లైసెన్స్‌డ్ రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన టెన్నిస్ వర్గాల్లో, స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.