Srisailam: ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో దేవాలయ నిబంధనలను అతిక్రమించి మద్యం సేవించే వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. దీనిలో భాగంగా, గత రెండేళ్లలో పట్టుబడిన భారీగా మద్యం బాటిళ్లను పోలీసులు ధ్వంసం చేశారు. శ్రీశైలం మల్లమ్మ కన్నీరు వద్ద ఉన్న డంపింగ్ యార్డ్‌లో ఈ మద్యం బాటిళ్లను ట్రాక్టర్‌తో తొక్కించి నాశనం చేశారు.
పోలీసులు, రెవెన్యూ, ఎక్సైజ్, పంచాయతీ శాఖ అధికారులు కలిసి ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. గత రెండేళ్లలో శ్రీశైలం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన 43 కేసులలో మొత్తం 1,197 మద్యం బాటిళ్లను, అలాగే 186 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. దేవాదాయ ధర్మాదాయ చట్టం ప్రకారం పవిత్ర పుణ్యక్షేత్రాలలో మద్యం ఇతర మత్తు పదార్థాలను సేవించడం నిషేధం. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు.
Also Read: Vice President: నూతన ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
శ్రీశైలం దేవస్థానంలోకి మద్యం తీసుకురావడం, సేవించడం నేరమని పోలీసులు తెలిపారు. దేవాలయం పవిత్రతను కాపాడేందుకు భక్తులు, పర్యాటకులు తప్పనిసరిగా ఈ నియమాన్ని పాటించాలని పోలీసులు కోరారు. ఎవరైనా ఈ నిబంధనలను అతిక్రమిస్తే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీశైలం క్షేత్రంలో మద్యం సరఫరా, అమ్మకాలపై పోలీసులు నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. ఈ చర్యలన్నీ భక్తులు ప్రశాంతమైన, పవిత్రమైన వాతావరణంలో దర్శనం చేసుకొనేలా చూసేందుకే అని పోలీసులు తెలిపారు. నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆదేశాలతో ఈ చర్యలు చేపట్టారు.